సోనియా ఆగ్రహం: రెండ్రోజుల్లో రెబల్ కిరణ్‌కు ఉద్వాసన?

ఇన్నాళ్లు హైదరాబాదులో ఉండి అధిష్టానం నిర్ణయంపై నిప్పులు చెరిగిన కిరణ్ బుధవారం ఏకంగా ఢిల్లీ నడివీధుల్లో రోడ్డెక్కారు. సొంత పార్టీ నిర్ణయాన్ని తప్పు పట్టారు. దీనిపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర ముఖ్య నేతలు ఆగ్రహంతో ఉన్నారట. అధిష్టానానికి అనుకూలంగా ఉన్న ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ వంటి వారు కూడా దీక్షలో పాల్గొనే పరిస్థితి ఏర్పడింది.
దీంతో ఇక కిరణ్‌ను ఉపేక్షించేది లేదని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయనను ఆ పదవి నుండి తొలగిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే, రాజ్యసభ ఎన్నికల అనంతరమే ఆయనను తొలగించాలని భావిస్తోందట. శుక్రవారం అంటే రేపు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల అనంతరం కిరణ్‌ను తొలగించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. అయితే, గతంలోను ఇలాంటి ప్రచారం జరిగిన నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయని అంటున్నారు. తనను కలిసి కిరణ్ వైఖరి పైన ఫిర్యాదు చేసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలతో డిగ్గీ మాట్లాడుతూ.. రెండు రోజులు అంటే రాజ్యసభ ఎన్నికలు అయ్యే వరకు ఓపిక పట్టాలని, అంతా అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications