సోనియా చెబితే జగన్ ఆడాల్సిందే: వర్ల, పొత్తుపై సిపిఎం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పినట్లుగా ఆడాల్సిందేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య గురువారం అన్నారు. జగన్ మెడ పైన సోనియా కత్తి వేలాడుతోందని విమర్శించారు. విభజన కోసం ఇదంతా సోనియా ఆడిస్తున్న నాటకమేనని ఆరోపించారు.
నిర్ణయం జరిగిపోయింది: విహెచ్
తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు అన్నారు. సీమాంధ్ర నేతలు ప్యాకేజీలు అడగాలి తప్ప ఢిల్లీలో కూర్చుంటే ఏమీ రాదన్నారు. రాజీనామాలు చేసిన వారంతా అవకాశవాదులేనని మండిపడ్డారు.

మొదటి నుండి స్పష్టతతో ఉన్నాం: ఎర్రబెల్లి
తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుండి స్పష్టతతో ఉందని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు ఒక్కటేనని ప్రజలకు తెలియజేస్తామన్నారు. అక్టోబర్ 1 నుండి యాత్రలు నిర్వహించి అదే విషయాన్ని చెబుతామన్నారు. భవిష్యత్త కార్యాచరణ కోసం టిటిడిపి నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎర్రబెల్లితో పాటు మోత్కుపల్లి నర్సింహులు, సత్యవతి రాథోడ్, ఉమా మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పొత్తులపై రాఘవులు
తాము పొత్తుల గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్సి రాఘవులు అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రాఘవులును కలిశారు. సమైక్యాంధ్ర పోరాటంలో కలిసి రావాలని వారు కోరారు. దానికి రాఘవులు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడారు. పొత్తుల గురించి ప్రశ్నించగా.. తాము పొత్తుల గురించి ఇప్పుడే ఆలోచించడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఆలోచిస్తామని, ఇప్పుడే దాని గురించి ఆలోచిస్తే వసంతం రాకుండానే కోయిల కూసినట్లుగా ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications