వైయస్ జగన్ పార్టీ పోటీ: కెసిఆర్ హ్యాపీ, కాంగ్రెసు కంగు
హైదరాబాద్: పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లభించరని అంచనాలు వేస్తున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో 110 మంది అభ్యర్థులను రంగంలోకి దించారు. తెలంగాణలో 119 శాసనసభా స్థానాలున్నాయి. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి తెలంగాణవాదం బలంగా లేని స్థానాల్లో 30 నుంచి 40 స్థానాలకు మాత్రమే పోటీ చేస్తుందని ప్రచారం సాగుతూ వచ్చింది.
అనూహ్యంగా జగన్ 110 మంది అభ్యర్థులను పోటీకి దించడంతో కాంగ్రెసు నాయకులు కంగు తిన్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అన్ని స్థానాల్లో పోటీకి దిగడంతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎక్కువగా కాంగ్రెసు ఓట్లనే చీల్చే అవకాశం ఉంది. దీంతో తెరాసకు ప్రయోజనం చేకూరుతుందని అంచనాలు వేస్తున్నారు.

దాదాపు యాభై స్థానాల్లో ఫలితాలు తారుమారవుతాయని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు తెలంగాణలోనూ ఉన్నారు. వారంతా కాంగ్రెసు పార్టీకి చెందినవారే. దాంతో వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే దెబ్బ తింటామనే ఆందోళన కాంగ్రెసు పార్టీలో నెలకొన్నట్లు చెబుతున్నారు. దీంతో నష్టనివారణ చర్యలకు కాంగ్రెసు నాయకులు దిగినట్లు చెబుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం యాభై స్థానాల్లో వారిని పోటీ నుంచి తప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. మహేశ్వరం నియోజకవర్గం అభ్యర్థి భాస్కర్ రెడ్డి పోటీ నుంచి విరమించుకోవడం ఇందులో భాగమేననే ప్రచారం కూడా సాగుతోంది.
వైయస్ జగన్ తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికైనా పాగా వేయాలనే ఉద్దేశంతోనే అంత మంది అభ్యర్థులను పోటీకి దించారని అంటున్నారు. తెలంగాణలో పార్టీ మనుగడ సాగించాలంటే పోటీ చేయక తప్పదని ఆయన అనుకున్నట్లు చెబుతున్నారు. పైగా, ఎన్నికల కమిషన్ గుర్తింపు కోసం కూడా అది అవసరంగా మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది. రాత్రికే రాత్రే వైయస్ జగన్ అభ్యర్థులను ఖరారు చేశారనే మాట వినిపిస్తోంది. ఇందులోని ఆంతర్యమేమిటనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications