YS Sharmila:కడప బరిలో షర్మిలా.. ఆ పార్టీ నుంచే..?
కాంగ్రెస్ నాయకత్వం ఆపరేషన్ వైసీపీ ప్రారంభించింది. టార్గెట్ జగన్ గా వ్యూహాలు సిద్దం చేస్తోంది. కడప గడప నుంచే కొత్త అస్త్రాలను సిద్దం చేస్తోంది. ప్రతిపక్షాల ప్రత్యక్ష..పరోక్ష..లోపాయి కారీ ఒప్పందాలతో ముఖ్యమంత్రి జగన్‌ను ఉక్కిరి బిక్కిరి చేయాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. వైఎస్ షర్మిల కేంద్రంగా ఇప్పుడు కాంగ్రెస్ కొత్త స్కెచ్ అమలు చేస్తోంది. షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనానికి సిద్దం అవుతోంది. అదే జరిగితే షర్మిల వచ్చే ఎన్నికల్లో కడప నుంచి బరిలోకి దించేందుకు కాంగ్రెస్ సిద్దం అవుతోంది.
కాంగ్రెస్ తో షర్మిల దోస్తీ
వైఎస్ షర్మిల కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ అధినాయకత్వంతో ఇప్పటికే ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయి. అధికారిక నిర్ణయాలే మిగిలాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాననే లక్ష్యంతో పార్టీ స్థాపించిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్‌తో జత కలవాలని నిర్ణయించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత చోటు చేసుకున్న వరుస పరిణామాలతో షర్మిల ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంక ఇప్పటికే షర్మిలతో చర్చించి..ఒప్పందాలు ఖరారైనట్లు సమాచారం. తెలంగాణ కంటే షర్మిల ద్వారా ఏపీలో పార్టీకి తిరిగి జీవం పోయాలనేది కాంగ్రెస్ నాయకత్వం ఆలోచన. అక్కడ తమను కాదని..సొంతంగా పార్టీ పెట్టి..అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది.

కాంగ్రెస్ ఆపరేషన్ ఏపీ
వైఎస్సార్ మరణం తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో వైఎస్సార్ కుటుంబం కాంగ్రెస్ నాయకత్వాన్ని కాదని కొత్త పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. జగన్ పైన కేసుల వేళ షర్మిల అన్నకు అండగా నిలిచారు. 2014,2019 ఎన్నికల్లో అన్న విజయం కోసం ప్రచారం చేసారు. అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్ధుల విజయానికి షర్మిల తన వంతు పాత్ర పోషించారు.

కానీ, జగన్ సీఎం అయిన తరువాత అన్న మాట కాదని తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు చేసి..ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం పైన పోరాటం సాగిస్తున్నారు. పార్టీ మనుగడలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఇదే సమయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నడిపిన మంత్రాంగంతో షర్మిల తిరిగి కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు సిద్దమయ్యారని విశ్వసనీయ సమాచారం.

ఎన్నికల బరిలో షర్మిల
వచ్చే ఎన్నికల్లోగానే షర్మిలకు ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. జూలై 8న వైఎస్సార్ జయంతి నాడు నివాళి అర్పించేందుకు ఈ సారి కాంగ్రెస్ అగ్రనేతలు తరలి వస్తారని చెబుతున్నారు. అక్కడే తన తండ్రి ఘాట్ నుంచే షర్మిల కాంగ్రెస్ తో ప్రయాణం..తన తండ్రి కోరిక అయిన రాహుల్ గాంధీని ప్రధానిని చేయటం కోసం పని చేస్తాననే ప్రకటనకు సిద్దం అయినట్లు తెలుస్తోంది.

ఇక, వచ్చే ఎన్నికల్లో షర్మిలను కడప లోక్ సభ నుంచి బరిలో దింపాలని..దీని పైన సీఎం జగన్ పైన ఒత్తిడి పెంచాలనేది కాంగ్రెస్ ఆలోచనగా చెబుతున్నారు. ఇందుకు షర్మిల అంగీకరిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏపీలో ఇప్పటికే సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. వీరితో బీజేపీ కలుస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. షర్మిల ద్వారా ఏపీలో రాజకీయం చేయాలని భావిస్తోంది. మరి..ఏపీలో కాంగ్రెస్ నాయకత్వం జగన్ కు వ్యతిరేకంగా అమలు చేసే వ్యూహాలకు సహకరిస్తారా లేదా అనేదే ఇప్పుడు కీలకంగా మారుతోంది.













Click it and Unblock the Notifications