తెలంగాణ: కాదంటే కిరణ్‌ రెడ్డికి ఉద్వాసన తప్పదా?

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో వచ్చే నాలుగు రోజులు కీలకం కానున్నాయి. ఈ నాలుగు రోజులే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భవిష్యత్తును కూడా నిర్ణయించనున్నాయి. ఈ నెల 12వ తేదీన అఖిల పక్ష సమావేశం నిర్వహించడంతో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై జరుగుతున్న కసరత్తు దాదాపుగా పూర్తవుతుంది. 12వ తేదీన ఐదు రాజకీయ పార్టీలతో సమావేశమై కేంద్ర మంత్రుల బృదం (జివోఎం) అభిప్రాయాలు తీసుకుంటుంది.

అయితే, ఈ నెల 12వ తేదీన జరిగే అఖిల పక్ష భేటీలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారా, లేదా అనేది తెలియదు. ఈ విషయంలో కేంద్ర హోం శాఖ ఏ విధమైన స్పష్టత ఇవ్వలేదు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఐదు పార్టీలతో విడివిడిగా జరిగే సమావేశాల్లో కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలకుడిగా పాల్గొనే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. గతంలో సిడబ్ల్యుసి సమావేశం నుంచి జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొనడం వల్ల ఈ సమావేశాల్లో పాల్గొంటారని భావిస్తున్నారు తప్పితే ఆ విషయంలో స్పష్టత లేదు.

ఇదిలావుంటే, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు తమ డిమాండ్ల పత్రాన్ని అందజేయనున్నారు. వారంతా దాదాపుగా విభజనను అడ్డుకోలేమనే నిర్ణయానికి వచ్చి సీమాంధ్రకు ఇవ్వాల్సిన ప్యాకేజీలపై, రాయితీలపై ఆ పత్రంలో వివరించే అవకాశాలున్నయని అంటున్నారు.

కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించి, ఆ స్థానంలో విభజనకు సహకరించే మరో నేతను కూర్చోబెట్టాలనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. డిసెంబర్‌ నెలాఖరు నాటికి లేదా జనవరి మొదటివారానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా చూడడానికి అది అవసరం కావచ్చునని అంటున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బుజ్జగించడానికి ఈ నెల 8వ తేదీన ఢిల్లీలో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. విభజనకు సహకరించాలని ఆయనను కాంగ్రెసు అధిష్టానం పెద్దలు సూచించే అవకాశం ఉంది. తమ సూచనను వినకపోతే కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. సహకరించడానికి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరిస్తే విభజనకు సంబంధించి ఈ నెల 12వ తేదీ వరకు జరిగే అన్ని కార్యక్రమాల్లోనూ ఆయనను భాగస్వామిని చేయవచ్చునని అంటున్నారు.

అయితే, అవకాశం వచ్చినా, రాకున్నా - అవసరమైతే కల్పించుకుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారు. ఒక రకంగా అధిష్టానాన్ని ధిక్కరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఈ స్థితిలో ఆయన వెనక్కి తగ్గి సహకరించడమనేది జరిగే పని కాదని చెబుతున్నారు. అధిష్టానం చేత ఉద్వాసనకు గురి కావాలనే వ్యూహాన్నే ఆయన అనుసరిస్తున్నారని కూడా అంటున్నారు. ఉద్వాసనకు గురైతే సమైక్యవాదిగా త్యాగం చేసిన ప్రతిష్ట దక్కుతుందని, సీమాంధ్రలో తిరుగులోని నాయకుడిగా ముందుకు రావచ్చునని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+