కారణం చంద్రబాబు అసమర్ధతే: సీఆర్, వైసీపీ దీక్షకు సీతారాం ఏచూరి మద్దతు
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేకహోదా కోసం తిరుపతిలో కాంగ్రెస్ కార్యకర్త మునికోటి ప్రాణాలర్పించిన నేపథ్యంలో రాష్ట్రంలో 'ప్రత్యేకహోదా' అంశంపై ఒక్కసారిగా వేడేక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం దేశ రాజధాని ఢిల్లీలో వైయస్ జగన్ సోమవారం చేపట్టిన దీక్షతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై కాస్తంత ఒత్తిడి పెరిగింది.
ఏపీకి ప్రత్యేకహోదా సాధించడంలో చంద్రబాబు రాజీపడ్డారు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య ఏపీకి ప్రత్యేకహోదాపై చంద్రబాబు నాయుడు ఎక్కడ? ఎవరితో పోరాడారో చెప్పాలంటూ నేరుగా విమర్శలు చేశారు.

తిరుపతిలో మునికోటి మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలను ఎలా మభ్యపెట్టాలా? మీడియా ముందుకు ఎలా వెళ్లాలా? అని చంద్రబాబు ఆలోచిస్తారని విమర్శించారు. చంద్రబాబుకు ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధిలేదని ఆయన తీవ్రస్దాయిలో ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేకహోదాపై ఎవరితో పోరాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం విభజించి పద్నాలుగు నెలలైనా ఇచ్చిన ఒక్కహామీని కూడా నెరవేరలేదంటే అందుకు కారణం చంద్రబాబు అసమర్ధతేనని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా సాధించి తీరుతామని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా కోసం తాము చేసే పోరాటంలో తెలుగుదేశం తమతో కలిసి నడవగలదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ఢిల్లీలో వైసీపీ దీక్షకు మద్దతు తెలిపిన సీతారాం ఏచూరి
ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ ఢిల్లీలో వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన దీక్షకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మద్దతు తెలిపారు. వేదికపై జగన్ మాట్లాడుతుండగా, జంతర్ మంతర్ వద్దకు సీతారం ఏచూరి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ దీక్షకు తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు తమ వంతు ప్రయత్నంగా పార్లమెంట్‌లో పోరాడతామని చెప్పారు. ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ చెప్పిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర విభజనతో సమస్యలు ఉత్పన్నమవుతాయని తాను ఆనాడే చెప్పానని, ఆ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్' అని గురజాడ చెప్పిన సూక్తిని కూడా గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications