ప్రేమ లేదా?: ఖమ్మానికి షర్మిలపై జగన్‌కు విహెచ్ ప్రశ్న
ఖమ్మం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు మండిపడ్డారు. షర్మిల భర్త బయ్యారం గనులను బాగానే దోచుకుపోయాడని, ఇంకా ఖనిజ దోపిడీ కోసమే ఖమ్మంలో షర్మిలను పోటీకి దింపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆమెను తెలంగాణ పొలిమేరల నుంచి తరిమికొట్టాలన్నారు.
ఇందిరమ్మ రథయాత్ర శనివారం ఖమ్మం జిల్లా ఇల్లెందు, భద్రాచలంలలో సాగింది. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడారు. వైయస్ మృతి చెంది ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఓదార్పు యాత్ర ఏమిటని ప్రశ్నించారు. సిపిఎం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల పొత్తు అపవిత్రమని, దేశాన్ని, ఖనిజ సంపదను దోచుకున్న వ్యక్తితో పేదల కోసం పోరాడే సిపిఎం పొత్తుకు దిగజారిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చించి సోనియా గాంధీ అన్నారు. ఇక్కడి ప్రజల్లో ఆమెకు సుస్థిర స్థానం ఏర్పడిందన్నారు. మూడో తేదీ మీటింగ్‌ల పార్టీని విలీనం చెయ్యాలని తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సూచించారు. తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానని, ఇంట్లో ఊడుస్తామని, బట్టలు ఉతుకుతామని చెప్పి ఇప్పుడు కిరికిరి చేయొద్దన్నారు. ఒక్క ఎంపీ సీటుతో తెలంగాణ తేగలవా అని ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పాటు కోసం తీవ్రంగా కృషి చేసిన కేంద్రమంత్రి జైరామ్ రమేష్‌ను నోటికొచ్చినట్టు మాట్లాడటం సమంజసం కాదన్నారు. రాయలసీమలో తనకు దీటుగా చెల్లెలు షర్మిల లీడర్ కావద్దనే ఉద్దేశంతోనే జగన్ ఆమెను ఖమ్మం నుంచి పోటీ చేయించాలని వ్యూహం పన్నుతున్నాడని విహెచ్ అన్నారు. చెల్లెలిపై ప్రేమ ఉంటే సీమలో పోటీ చేయించుకోవాలన్నారు.
అడ్డుకున్న రేణుక వర్గం
వి హనుమంత రావు పర్యటనను ఎంపి రేణుకా చౌదరి వర్గం అడ్డుకుంది. పోలీసులకు, రేణుక వర్గానికి చెందిన నాయకులను తోపులాట జరిగింది. బుగ్గవాగు వంతెన వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్ వాడి కార్యకర్తలు అడ్డుకోగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.












Click it and Unblock the Notifications