తెరాసతో డూప్ ఫైట్, జగన్‌ని అందుకే అన్లేదు: వెంకయ్య
హైదరాబాద్: కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిల బంధం దృఢమైనదని, అది తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలతో స్పష్టమైందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు శనివారం అన్నారు. కాంగ్రెస్, తెరాస ఈ ఎన్నికల్లో డూప్ ఫైటింగ్ చేశాయని ఎద్దేవా చేశారు.
ఎన్నికల తర్వాత కాంగ్రెస్, తెరాస కలిసిపోతాయని తాము పలుమార్లు చెప్పామని, ఇప్పుడు కెసిఆర్ కూడా అదే విషయాన్ని చెప్పారన్నారు. తాను సోనియా గాంధీ, రాహుల్ గాంధీని విమర్శించలేదని, ఎన్డీఏకు మద్దతు ఇవ్వబోమని కెసిఆర్ చెబుతుండడాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్, తెరాస మధ్య అంతర్గతంగా బంధం కొనసాగుతూనే ఉందన్నరాు.

ఈ రెండు పార్టీలు ప్రజలను నమ్మించడానికి ఉత్తుత్తి ఫైటింగ్ చేశాయన్నారు. జగన్ పార్టీ, తెరాస మధ్య కూడా అంతర్గత బంధం సజీవంగానే ఉందన్నారు. అందుకే ఎన్నికల్లో తెరాస నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు టీఆర్ఎస్‌ను గానీ విమర్శించలేదన్నారు.
ఇప్పుడేమో కెసిఆర్ అటు సీమాంధ్రలో జగన్, ఇటు తెలంగాణలో తెరాస ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయని చెబుతున్నారన్నారు. ఆ రెండు పార్టీల మధ్య అవగాహన ఉందనడానికి ఇదే తార్కాణమన్నారు. మోడీ, ఎల్లయ్య, పుల్లయ్య... ఎవరు అధికారంలోకి వచ్చినా సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వానికే మద్దతు ఇస్తామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా... కేంద్రం మద్దతు లేకుండా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి సాధించలేదన్నారు.
ప్రస్తుతం సీమాంధ్ర, తెలంగాణ రెండూ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలేనని, రెండింటినీ అభివృద్ధి చేసుకోవాలంటే తప్పకుండా కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందేనన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ బిజెపి, టిడిపి కూటమి తప్పక విజయం సాధిస్తుందన్నారు. సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మోడీకి మరింత దన్ను లభిస్తుందన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహం విపరీతంగా ఉందని, దీనికి ఎన్నికల సంఘాన్ని ఒక్కదానినే బాధ్యులుగా చూపడం తగదన్నారు.












Click it and Unblock the Notifications