CJI NV Ramana: తిరుమలలో టెంకాయ ఎలా కొట్టాలో..ఎలా హారతి ఇవ్వాలో కోర్టులు చెప్పాలా: సుప్రీం
అమరావతి: కలియుగ వైకుంఠంలా విరాజిల్లుతోన్న తిరుమల ఆలయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. తిరుమల ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిర్వహించే నిత్య పూజలు, కైంకర్యాలు, ఇతర ఆర్జిత సేవా కార్యక్రమాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. శాస్త్రాల్లో పేర్కొన్న విధంగా ఆలయాల్లో పూజలు, ఇతర సేవా కార్యక్రమాలను చేపడుతుంటారని, వాటిల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని తేల్చి చెప్పింది.

ఏమిటీ పిటీషన్..?
తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్య పూజలు, కైంకర్యాలు.. నియమాలకు విరుద్ధంగా సాగుతున్నాయంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలైంది. శార్వరి దాదా ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలో ఏర్పాటైన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఉదయం ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టింది. ఈ ధర్మాసనంలో సీజేఐ ఎన్వీ రమణతో పాటు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమాకోహ్లీ ఉన్నారు.

ఆలయ వ్యవహారాల్లో కోర్టుల జోక్యం అవసరమా?
విచారణ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయాల్లో అర్చకులు నిర్వహించే నిత్య పూజల విషయంలో రాజ్యంగబద్ధంగా ఏర్పాటైన న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందా? అని పిటీషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఆ అవసరం లేదని స్పష్టం చేశారు. తిరుమల ఆలయ విషయంలో మాత్రమే కాకుండా.. ఏ ఆలయ వ్యవహారాల్లో కూడా న్యాయస్థానాలైనా జోక్యం చేసుకోలేవని తేల్చి చెప్పారు. ఈ స్పెషల్ లీవ్ పిటీషన్‌ను కొట్టివేస్తున్నామని అన్నారు.

కొబ్బరికాయ ఎలా కొట్టాలో కోర్టులు చెప్పాలా?
విచారణ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ.. పిటీషనర్ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయాల్లో ఎలా కొబ్బరికాయ కొట్టాలో..ఎలా హారతి ఇవ్వాలో.. న్యాయస్థానాలు చెప్పాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. ఆ అవసరం లేదని అన్నారు. తిరుమల సహా ఏ ఆలయంలోనైనా మూలవిరాట్టుకు ఆగమ శాస్త్రాల ప్రకారమే పూజలను నిర్వహిస్తారని వ్యాఖ్యానించారు. రాజ్యంగబద్ధంగా ఏర్పాటైన న్యాయస్థానాలు ఆ నియమాలు, నిబంధనలు మార్చలేవని, రోజువారీ పూజా కార్యక్రమాల్లో జోక్యం చేసుకోలేవని అన్నారు.

కింది కోర్టుకు వెళ్లండి..
నిజంగానే ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా తిరుమల శ్రీవారి ఆలయంలో పూజలను నిర్వహిస్తూ ఉంటే.. ఆ విషయాన్ని కింది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని ఎన్వీ రమణ సూచించారు. ఖచ్చితమైన సాక్ష్యాధారాలు ఉంటేనే కింది కోర్టును ఆశ్రయించాలని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన తీరులో ఏవైనా మార్పులు కనిపిస్తే. నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటే దానికి న్యాయస్థానాలు స్పందించవచ్చని చెప్పారు. వాటిపై దేవస్థానాల అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.

అంతకుముందు..
శార్వరి దాదా ఈ స్పెషల్ లీవ్ పిటీషన్‌ను దాఖలు చేసిన సమయంలో సుప్రీంకోర్టు.. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. పిటీషనర్ పేర్కొన్న అంశాలపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దానికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఇదివరకే కౌంటర్‌ను దాఖలు చేశారు. వైఖానస ఆగమ శాస్త్రాల ప్రకారం.. పెదజీయరు, చినజీయరు స్వామివార్ల పర్యవేక్షణలో శ్రీవారికి నిత్యపూజలు, కైంకర్యాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దాన్ని పరిశీలించిన తరువాత సుప్రీంకోర్టు ధర్మాసనం.. తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ పిటీషన్‌ను కొట్టివేసింది.












Click it and Unblock the Notifications