అమరావతి: ఎపిలో పండుగల తేదీల విషయాల్లో ఇటీవలికాలంలో పంచాంగకర్తల మధ్య భేదాభిప్రాయాలు రావడం పరిపాటిగా మారింది. కృష్ణా పుష్కరాల నుంచి ఉగాది వరకు ఇలా ప్రతీదీ ఈ విషయమై వివాదాస్పదమవుతూనే ఉంది.
తాజాగా సంక్రాంతి పండుగ విషయంలోను మరోమారు పంచాంగకర్తల మధ్య భేదాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. ధృక్ సిద్ధాంత పంచాంగకర్తలు జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 1.46గంటలకు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నందున ఆరోజే మకర సంక్రమణమని అంటున్నారు. అయితే సంకాంత్రి 14న కాదని, ఆ రోజు సాయంత్రం 7:43 గంటలకు మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఆ మర్నాడే మకర సంక్రమణ ప్రయుక్త పుణ్యకాలమని మరికొందరు పంచాంగకర్తలు వాదిస్తుండటం గందరగోళానికి దారితీస్తోంది.

పంచాగకర్తల పంచాయితీ...
ధృక్ సిద్ధాంత పంచాంగకర్తలు జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగని అంటుండగా గంటల పంచాగకర్తలు మాత్రం ముందుగా ప్రకటించిన విధంగా జనవరి 15 నే సంక్రాంతి అంటున్నారు. దీంతో అసలు పండుగ ఎప్పుడనే విషయంపై గందరగోళం తలెత్తింది.


క్యాలెండర్ లో...ప్రభుత్వం కూడా...
క్యాలెండర్లు అన్నీ 15నే మకర సంక్రాంతి అని ప్రచురించాయి. 14న భోగీ, 15న సంక్రాంతి, 16న కనుమ జరుపుకోవాలని గంటల పంచాంగాలు చెబుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా 14న భోగీ, 15 సంక్రాంతి అని సెలవుల జాబితాలో పేర్కొంది.

ధృక్ సిద్ధాంతం ప్రకారం...
14 న సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నందున ఆరోజే మకర సంక్రమణమని, భారత సిద్ధాంత పంచాంగం కూడా ఇదే విషయం చెబుతోందని విజయవాడకు చెందిన ప్రముఖ పంచాంగ కర్త పులిపాక చంద్రశేఖర శాస్ర్తి ఉదహరిస్తున్నారు. 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ పండుగలు జరుపుకోవాలని ఆయన వాదిస్తున్నారు. మరోవైపు గంటల పంచాంగాలలో మకర సంక్రమణం 14వ తేదీన కాదని ఇప్పటికే ప్రచురించారు. ఆరోజు రాత్రి 7.43ని.లకు మకర సంక్రమణం జరుగుతుంది. కనుక ఆ మర్నాడే మకర సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ పుణ్యకాలం అంటూ పేర్కొన్నారు.

ముందు నుంచి...గంటల పంచాంగం...
అంటే 14వ తేదీన భోగి, 15వ తేదీన మకర సంక్రాంతి, 16 వతేదీన కనుమ అవుతుందని గంటల పంచాంగాలు ఘోషిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 14న భోగి, 15న సంక్రాంతి అని సెలవుల జాబితా ప్రకటించింది. అయితే పంచాంగకర్తల భిన్న వాదనలు పక్కనపెట్టి..కుటుంబపెద్దలు చెప్పిన మేరకు పండుగను నిర్వహించుకోవడం ఉత్తమం అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!