శ్రీశైలం ఆలయానికి కరోనా ఎఫెక్ట్.. స్వామి వారి సర్వదర్శనాలు నిలిపివేత
మహమ్మారి కరోనా ఎఫెక్ట్ మళ్లీ దేవాలయాలపై పడింది . రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ భారిన పడి ఆస్పత్రుల్లో చేరే వారే సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ కరోనా ప్రభావం ఇప్పుడు శ్రీశైలం దేవాలయంపై పడింది. వైరస్ కట్టడికి శ్రీశైల దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు . సోమవారం నుంచి స్వామి వారి సర్వదర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

సర్వదర్శనాలు తాత్కాలికంగా నిలిపివేత
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేవాదాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో శ్రీశైలం దేవస్థానం అధికారులు సోమవారం నుంచి సర్వదర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ ప్రాంగణంలో పుణ్యస్నానాలు, అన్నప్రసాద వితరణ కార్యాక్రమాలను కూడా నిలిపివేస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు.

ఆన్‌లైన్‌లోనే దర్శనం టికెట్ రిజిస్ట్రేషన్..
శ్రీశైలం వచ్చే భక్తులు టికెట్లను ఈనెల 18 నుంచి ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలని ఈవో లవన్న సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ఇకపై ప్రతి రోజు.. నాలుగు విడతల్లో సామూహిక అభిషాకాలు ఉంటాయని వెల్లడించారు.
శీఘ్ర, అతిశ్రీఘ్ర దర్శనం టికెట్లను కూడా అన్ లైన్ ద్వారానే పొందే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో టికెట్ల రిజిస్ట్రేషన్‌కు కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పని సరిగా జతచేయాలని ఈవో లవన్న స్పష్టం చేశారు. భక్తులు తప్పని సరిగా మాస్కులు ధరించాలని సూచించారు.

ఏపీలో కరోనా విలయం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 30,022 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 4,570 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి 669 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,770 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒకరు మృతి చెందారు.
రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,124 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తర్వాత విశాఖ పట్నం 1,028, గుంటూరు 368, అనంతపురం 347, నెల్లూరు 253, తూర్పుగోదావరి 233, విజయనగరం 209 , కృష్ణా 207 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం 187, ప్రకాశం 178, కడప 173, కర్నూలు 168, పశ్చిమ గోదావరి 95 మంది వైరస్ బారిన పడ్డారు.

తెలంగాణలో భారీగా కేసుల నమోదు
తెలంగాణ కరోనా వైరస్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 55,883 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 2047 కరోనా కేసులు వెలుగుచూశాయి.ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 2013 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే కొత్తగా 1174 కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications