ఆంధ్రా వర్సిటీలో కరోనా కలకలం.. ఇంజనీరింగ్ కాలేజీలో 102 మందికి పాజిటివ్.. ఐసోలేషన్ వార్డుగా హాస్టల్ బ్లాక్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 102కి చేరింది. శనివారం(మార్చి 26) నాటికి 50 మంది విద్యార్థులు కరోనా బారినపడగా... ఆదివారం(మార్చి 28) ఆ సంఖ్య మరో 51కి పెరిగింది. కరోనా సోకినవారిలో 96 మంది పురుష విద్యార్థులు కాగా ఐదుగురు వర్సిటీ సిబ్బంది,ఒక మహిళా స్టూడెంట్ ఉన్నారు. అప్రమత్తమైన వర్సిటీ అధికారులు ఇంజనీరింగ్ కాలేజీలోని ఒక హాస్టల్ బ్లాక్‌ను ఐసోలేషన్ వార్డుగా మార్చేశారు.

పరిస్థితిని సమీక్షించిన మంత్రి అవంతి...
ఇప్పటికే కరోనా బారినపడ్డ విద్యార్థుల కాంటాక్ట్స్ తెలుసుకునేందుకు ఇంజనీరింగ్ కాలేజీలోని మిగతా విద్యార్థులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ఆంధ్రా యూనివర్సిటీకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వైరస్ సోకిన వారికి చికిత్స అందించేలా... వైరస్ కట్టడికి అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు. 'కరోనా బారినపడినవారికి తగిన వైద్య సదుపాయం అందించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. కోవిడ్ 19 కిట్స్ అందజేశారు. కాబట్టి విద్యార్థు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదు.' అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.

ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తితే...
ఇప్పటికే కరోనా సోకిన విద్యార్థుల ప్రైమరీ కాంటాక్ట్స్‌కు మరో ఐసోలేషన్ బ్లాక్‌లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి అవంతి తెలిపారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి తలెత్తితే ఇప్పటికే విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రిలో 550 పడకలు,విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 650 పడకలు సిద్దంగా ఉంచామని చెప్పారు. యూనివర్సిటీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేలా జిల్లా వైద్యాధికారికి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీ అధికారులు,వర్సిటీ వైస్ ఛాన్సలర్,జిల్లా అధికారులతో కలిసి మంత్రి అవంతి సమీక్ష సమావేశం నిర్వహించారు.

కొత్తగా 1005 పాజిటివ్ కేసులు
గడిచిన 24గంటల్లో ఏపీలో కొత్తగా 1005 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,98,815కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7205కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా మరో 324 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,86,216కి చేరింది. గడిచిన 24గంటల్లో మొత్తం 31,142 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 149,90,039కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7205కి చేరింది. కొత్తగా నమోదైన మరణాల్లో చిత్తూరు,కృష్ణా జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.












Click it and Unblock the Notifications