ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకు కరోనా వ్యాక్సిన్..షెడ్యూల్ ఇదే: వారితోపాటు ఎవరికెవరికంటే?
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. రెండోదశ వ్యాక్సినేషన్‌లో భాగంగా కేంద్ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా 60 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వృద్ధులు, 45 సంవత్సరాల పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న వారికి జగన్ సర్కార్ కరోనా టీకాలను వేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఈ టీకాలను వేస్తోండగా.. ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఒక్కో డోసుకు 250 రూపాయలను వసూలు చేస్తోన్నారు.
ఈ పరిస్థితుల మధ్య ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు వారికి టీకాలు వేస్తారు. అమరావతి ప్రాంతంలోని వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణంలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వ్యాక్సిన్ వేస్తారు.

స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అసెంబ్లీ కార్యదర్శి పీ బాలకృష్ణమాచార్యులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టీకాలను వేయించదలచుకున్న వారు తమ వెంట ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుందని సూచించారు. చివరి రెండు రోజుల్లో అంటే.. 25, 26 తేదీల్లో సచివాలయం ఉద్యోగులు, సిబ్బందికి టీకాలను వేస్తారు. శాసనసభ, శాసన మండలి సమావేశాల కవరేజీకి వెళ్లే జర్నలిస్టులకు కూడా ఈ సౌకర్యాన్ని వర్తింపజేసినట్లు బాలకృష్ణమాచార్యలు తెలిపారు. దీన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications