టీటీడీలో అక్రమాలకు సగం కారణం ప్రజా ప్రతినిధులు, పాలకమండలి సభ్యులే...!
తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరుని సేవలకు సంబంధించి టీటీడీలో ఎన్నో అక్రమాలు గతంలో వెలుగు చూశాయి. గడచిన నాలుగైదు నెలల్లో అభిషేకం, సుప్రభాతం, తోమాల సేవ, కల్యాణోత్సవం వంటి ప్రధాన సేవలకు సంబంధించిన టికెట్ల జారీలో పలు అక్రమాలు జరిగినట్లు టీటీడీ నిఘా విభాగం గుర్తించింది.
టీటీడీలో అక్రమార్కుల ఆగడాలను అరికట్టేందుకు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా, ఆగకపోవడానికి కారమం ప్రజా ప్రతినిధులు, పాలక మండలి సభ్యులేనని గుర్తించిన అధికారులు ఆశ్చర్యపోయారు. అదెలాగంటే, నిజానికి నిత్యం జరిగే స్వామివారి సేవలకు సంబంధించి ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్‌తో పాటు సిఫార్సు లేఖలపై టికెట్లను టీటీడీ జారీ చేస్తుంది.
ప్రజాప్రతినిధులకు వారి స్థాయిని బట్టి సిఫార్సు లేఖల కోటా ఉంటుంది. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు రోజుకు ఒకటి ఉండగా, ఎంపీలు, మంత్రులకు, కేంద్రమంత్రులకు ఎంచుకున్న సేవను బట్టి రెండు నుంచి ఐదు వరకు టిక్కెట్లను జారీ చేస్తుంది. ఇక టీటీడీ బోర్డు పాలకమండలి సభ్యులకు అయితే పది వరకూ సిఫార్సు లేఖలు ఇచ్చే సదుపాయం ఉంది.

ఈ సిఫార్సు లేఖలే అక్రమార్కులకు పాలిట వరంగా మారాయి. తిరుమలకు వచ్చే వ్యక్తుల పేర్లు, వారికి కావాల్సిన సేవ, వసతి సదుపాయం వివరాలతో నిండిన సిఫార్సు లేఖలపై సంతకాలు పెట్టాల్సిన వారు, ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టి అనుచరులకు ఇచ్చేస్తున్నారు.
ఈ సిఫార్సు లేఖలను కొండపై ఉన్న అక్రమార్కులకు అమ్ముతుండటంతో, వారు సేవలు, డిమాండ్‌ను బట్టి సిఫార్సు లేఖల కోసం వేలు, లక్షలు వెచ్చించే ధనిక కుటుంబాలు, ఇతర రాష్ట్రాల వారికి అమ్ముతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా అక్రమాలకు సంబంధించి పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
సుప్రభాతం, అర్చన, తోమాల సేవలకు సిఫార్సు లేఖల డిమాండ్ ఉంది. ఇటీవల ఓ వ్యక్తి రూ. 500 విలువైన ఎల్-1 సిఫార్సు లేఖను రూ. 10 వేలకు విక్రయిస్తూ పట్టుబడగా, ఐదు సుప్రభాత టికెట్ల కోసం సిఫార్సు చేస్తే దానికి మరో రెండు టికెట్లు కావాలని జతపరుస్తూ, వాటిని రూ. 46 వేలకు విక్రయిస్తూ మరో దళారీ పట్టుబడ్డాడు.
దీంతో తిరుమలలో అక్రమాలను అరికట్టేందుకు నిఘా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. త్వరలోనే నిబంధనలు మార్చుతామని, ప్రజాప్రతినిధులు ఖాళీ కాగితాలపై సంతకాలు చేయరాదని సలహాలు ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు తాము సిఫార్సు చేస్తున్న వారి వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో ఇచ్చేలా సరికొత్త సాఫ్ట్ వేర్‌ను అభివృద్ధి చేయనున్నట్టు ఈఓ సాంబశివరావు తెలిపారు.












Click it and Unblock the Notifications