"పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టు"- చేతులెత్తి దణ్ణంపెడుతున్నా- శేఖర్ కమ్ముల పోస్ట్..!
పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరసిస్తూ ఢిల్లీలో విద్యార్ధులు చేపట్టిన ఆందోళనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ కదిలిస్తున్నాయి. ఇదే క్రమంలో ఢిల్లీలో ఆందోళనల్లో పాల్గొని, లాఠీ దెబ్బలు తిన్న విద్యార్ధులకు మద్దతుగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. ఇదే క్రమంలో టాలీవుడ్ లోనూ విద్యార్ధుల జీవితాలే ఇతివృత్తంగా పలు సినిమాలు చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) కూడా విద్యార్దుల కోసం గళం విప్పారు.
ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టులో శేఖర్ కమ్ముల విద్యార్ధుల ఆందోళనలకు తన పూర్తి మద్దతు ప్రకటించారు. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా, నీట్ పేపర్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకి పరిహారం,మళ్లీ ఇలాంటివి జరగకుండా ఒక గట్టి భరోసా- ఏ ప్రభుత్వమైనా అడక్కుండా చేయాల్సిన పనులు ఇవి అంటూ శేఖర్ ట్వీట్ చేశారు. ఈ చిన్న డిమాండ్లు సాధించుకోడానికా లక్షల మంది పిల్లలు లాఠీ దెబ్బలు తిని రక్తమోడుస్తున్నారు! తిండీతిప్పలు మాని దెబ్బలకి ఓర్చుకుని, రాత్రనకా పగలనకా ఉద్యమిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పిల్లలు జవాబుదారీతనం అడుగుతున్నారని, ఇందులో న్యాయం ఉందని, ప్రభుత్వం వాళ్ల మాట వినాలి, వాళ్లకి భరోసా ఇవ్వాలని, వాళ్ల స్ఫూర్తిని గెలిపించాలని శేఖర్ కమ్ముల కోరారు. మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టు, మన పిల్లలు గెలిస్తే మనం బ్రతికినట్టు అంటూ ఓ సినీ తరహా డైలాగ్ ను కూడా ఆయన తన పోస్టుకు జోడించారు. వాస్తవానికి ప్రజలు గెలిస్తే ప్రభుత్వాలు గెలిచినట్టు అని, డియర్ జెన్ జీ .. మీరు చేస్తున్న ఈ పోరాటానికి చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను, I salute you అంటూ శేఖర్ కమ్ముల తన పోస్టును ముగించారు.












Click it and Unblock the Notifications