మ్యాట్రిమోనీ కి‘లేడీ’ దీప్తి కేసులో పోలీసులకు చుక్కెదురు! వెలుగులోకి కొత్తకోణం!
విజయవాడ : పెళ్లి పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతూ, ఎన్నారై పెళ్లి కొడుకుల నుంచి డబ్బు గుంజుతోన్న పల్లపూరి దీప్తి కేసులో బెజవాడ పోలీసులకు చుక్కెదురైంది. హైదరాబాద్‌లో ఉంటోన్న దీప్తిని విజయవాడ పోలీసులు అరెస్టు చేయడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
విచారణ పరిధితో సంబంధం లేకుండా కేసు ఎలా నమోదు చేస్తారంటూ పటమట పోలీసుల తీరును న్యాయస్థానం గురువారం తప్పుబట్టింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించింది.

టీడీపీ ఎమ్మెల్యే ఒత్తిడితోనే కేసు..
ఎన్నారై పెళ్లికొడుకులను మోసం చేసిన పల్లపూరి దీప్తి అరెస్ట్ నేపథ్యంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒత్తిడితోనే పటమట పోలీసులు కేసు పెట్టారని దీప్తి తల్లి పూర్ణవల్లి ఆరోపించారు. ఎమ్మెల్యే ఒత్తిడి చేసి సీఐ దామోదర్‌తో సంబంధం లేని కేసును నమోదు చేయించారని ఆమె అన్నారు.

రెండ్రోజుల పరిచయంతో డబ్బులిస్తారా?
ఎన్నారై ధరణికుమార్‌ను తన కుమార్తె డబ్బులు అడగలేదంటూ.. కేవలం రెండ్రోజుల పరిచయంతో ఎవరైనా లక్షా ఎనభై ఆరువేల రూపాయలు బ్యాంక్ అకౌంట్‌లో వేస్తారా? అని పూర్ణవల్లి ప్రశ్నించారు. మూడోరోజే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? అంటూ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒత్తిడితో పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ఆరోపణలు చేశారు.

అసలేం జరిగిందంటే...
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పటమటకు చెందిన ధరణీకుమార్ మూడు నెలల క్రితం భారత్ మ్యాట్రీమోనిలో వధువు కోసం వెతకగా, దీప్తి అనే యువతి పరిచయం అయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యవసరంగా తనకు కొంత డబ్బు అవసరం అని ధరణీకుమార్‌ను దీప్తి అడిగింది. ఆమె మాటలు నమ్మిన అతడు రెండు దఫాలుగా రూ.1.86 లక్షలు ఆమె అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయితే డబ్బు తీసుకున్న నాటి నుంచి దీప్తి ఆచూకీ తెలియకపోవడంతో ధరణీకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విజయవాడకు తరలింపు...
ఈ కేసులో విచారణ జరిపిన పోలీసులు.. గుంటూరు బ్రాడీపేటకు చెందిన పల్లపూరి దీప్తిని నిందితురాలిగా గుర్తించారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఆమె మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో ఫేక్ ప్రొఫైల్‌ను సృష్టించి ఎన్నారై పెళ్లికొడుకులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. దీప్తిని విజయవాడ పటమట పోలీసులు బుధవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను విజయవాడకు తరలించారు.

పటమట పోలీసులకేం సంబంధం?
మరోవైపు దీప్తి రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయస్థానం తప్పు పట్టింది. ఈ కేసుతో పటమట పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని కోర్టు తేల్చిచెప్పింది. దీప్తి హైదరాబాద్‌లో ఉంటుంటే పటమటలో కేసు ఎలా పెడతారని దీప్తి లాయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ధరణికుమార్‌తో అసలు తమ అమ్మాయికి ఎలాంటి పరిచయం లేదని దీప్తి తల్లి చెబుతోంది. అయితే పోలీసులు మాత్రం.. దీప్తి ఇంతకుముందు మరో ఇద్దరిని ఇలాగే మోసం చేసిందని, ఆమెపై పెనమలూరు, హైదరాబాద్‌లోనూ కేసులు ఉన్నాయని, చెబుతున్నారు.












Click it and Unblock the Notifications