ఏపీలో కరోనా: లక్షకు చేరువగా కేసులు - 1041 మరణాలు.. ఆ రెండు జిల్లాల్లో బీభత్సం..
ఆంధ్రప్రదేశ్ లో కరోనా టెస్టుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ పాజిటివ్ కేసులు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో మొత్తం 47,645 శాంపిళ్లను పరీక్ష చేయగా, కొత్తగా 7,627 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరువగా.. 96,298కి పెరిగింది.
Recommended Video
ఆదివారం ఒక్కరోజే 3,041 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తంగా వ్యాధి నుంచి కోలుకున్నవాళ్ల సంఖ్య 46,,301గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 48, 956గా కొనసాగుతున్నది. మరణాల పరంగా ఏపీ 1000 మార్కును దాటేసింది. ఆదివారం ఏకంగా 56 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1041కి పెరిగింది. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 16.43లక్షల శాంపిళ్లను టెస్టు చేసినట్లు బులిటెన్ లో పేర్కొన్నారు.

గత 24 గంటల్లో కొత్త కేసులు, మరణాల దృష్ట్యా తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉన్నట్లు తెలుస్తున్నది. తూర్పుగోదావరిలో కొత్తగా 1095 కేసులు రాగా, అత్యధికంగా 9 మంది చనిపోయారు. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 13,486కు, మరణాల సంఖ్య 122కు పెరిగింది. ఇటు కర్నూలు జిల్లాలో కొత్తగా 1213 కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి. ఈ జిల్లాలో మొత్తం కేసులు 11,570, మరణాలు అత్యధికంగా 162 నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో మిగతా జిల్లాల్లోని కొత్త కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది.. విశాఖపట్నం(8మృతి, 784 కేసులు), కృష్ణా (5మృతులు, 332 కేసులు), నెల్లూరు(5గురు మృతి, 329 కేసులు), శ్రీకాకుళం(5 మృతి, 276 కేసులు), పశ్చిమగోదావరి (5గురి మరణం, 859 కేసులు), చిత్తూరు(4 మృతి, 573 కేసులు), విజయనగరం(3 చనిపోగా, 247 కేసులు), అనంతపురంలో కొత్తగా 734 కేసులు, రెండు మరణాలు, కడప జిల్లాలో 396 కేసులు, మూడు మరణాలు, గుంటూరు జిల్లాలో 547 కొత్త కేసులు, ఒకరు మృతి, ప్రకాశంజిల్లాలో 242 కొత్త కేసులు, ఒకరు మృతి చెందారు.












Click it and Unblock the Notifications