ఏపీలో కరోనా: భారీగా తగ్గిన కేసులు -కొత్తగా1,578, నిన్న 22 మంది మృతి -కర్ఫ్యూ సడలింపు
ఆంధ్రప్రదేశ్ లో కిందటి రోజుతో పోల్చుకుంటే ఇవాళ కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గినప్పటికీ మరణాలు పెరిగాయి. రికవరీలు భారీగా ఉండటంతో యాక్టివ్ కేసుల ఇంకాస్త తగ్గాయి. కొవిడ్ పరిస్థితుల రిత్యా రాష్ట్రంలో కొనసాగుతోన్న కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. అయితే, సడలింపులు కూడా భారీగానే ప్రకటించింది. వివరాలివి..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో 62,657 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 1,578 మందికి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,24,421కు పెరిగింది. కొత్త కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 305, చిత్తూరు జిల్లాలో 257, నెల్లూరు 179, ప్రకాశం 173, పశ్చిమ గోదావరి జిల్లాలో 152, కడప జిల్లాలో 117 కేసులు వచ్చాయి.

నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కరోనా కాటుకు 22 మంది బలైపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,024కు పెరిగింది. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున చనిపోయారు.
రాష్ట్రంలో కొవిడ్ బారి నుంచి నిన్న ఒక్కరోజే 3,041 మంది కోలుకున్నారు. తద్వారా రికవరీల సంఖ్య 18,84,202కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 28,680గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,30,48,945 శాంపిల్స్ సేకరించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే,
ఏపీలోని అన్ని జిల్లాల్లో కొవిడ్ కర్ఫ్యూను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు కల్పించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సడలింపులు ఉంటాయని, రాత్రి 9 గంటలకల్లా దుకాణాల మూసేసి, 10 గంటల్లోగా ప్రజలంతా ఇళ్లకు చేరుకోవాలని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.












Click it and Unblock the Notifications