ఏపీలో కరోనా మరణమృదంగం -ఒక్కరోజే 114 మరణాలు, కొత్తగా 22,610 కేసులు -ఆ 2జిల్లాల్లో వైరస్ విలయం
ప్రాణం విలువ బాగా తెలుసని, ప్రజల్ని కాపాడేందుకు శక్తిమించి పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా మాటలు చెప్పినా, ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విలయం మరింత తీవ్రతరమైంది. మరణాలు భారీ స్థాయిలో నమోదవుతుండటం అందరినీ కలవరపెడుతున్నది. డిశ్చార్జీలు పెరుగుతున్నా, అదే స్థాయిలో కొత్త కేసులు వస్తుండటంతో యాక్టివ్ సంఖ్య 2లక్షలకుపైగానే కొనసాగుతున్నది. వివరాల్లోకి వెళితే..

ఒకే రోజు 114 మరణాలు
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ వివరాల ప్రకారం, రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి వల్ల 114 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల రోజువారీ మరణాల్లో ఇది పెద్ద సంఖ్యగా ఉంది. కొత్త వాటితో కలిపి ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన కరోనా మరణాలు 9,800లకు పెరిగాయి. నిన్న పశ్చిమగోదావరి జిల్లాలో 15 మంది చనిపోగా, చిత్తూరులో 10, తూర్పు గోదావరిలో 10, గుంటూరులో 10, విశాఖలో 10, అనంతపురంలో 9, విజయనగరంలో 9, కృష్ణాలో 8, కర్నూలులో 7, ప్రకాశంలో 7, నెల్లూరులో 5, శ్రీకాకుళంలో 5, కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించారు.

కొత్తగా22,610 కేసులు.. 2.1లక్షల యాక్టివ్
గడిచిన 24 గంటల్లో రాష్ట్రం మొత్తం మీద 1,01,281 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 22,610 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1521142కు పెరిగింది. నిన్న ఒక్కరోజే 23,098 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తద్వారా మొత్తం డిశ్చార్జీల సంఖ్య 1299313కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 209134 ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,83,42,918 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఆ రెండు జిల్లాల్లో విలయం..
ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో వైరస్ విలయతాండవం కొనసాగుతున్నది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 3602 కొత్త కేసులు, చిత్తూరు జిల్లాలో 3185 కొత్త కేసులు, అనంతపురం 1794, గుంటూరు 1584, కడప 989, కృష్ణా 1084, కర్నూలు 1178, నెల్లూరు 1219, ప్రకాశం 1523, శ్రీకాకుళం 1517,విశాఖపట్నం 1984, విజయనగరం 885, పశ్చిమ గోదావరి జిల్లాలో 2066 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీ సర్కారు గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కరోనాపై పోరాటానికి రూ.1000కోట్లు కేటాయించారు. వ్యాక్సిన్ల కొరతపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications