ఏపీలో కరోనా: 20లక్షలకు చేరువగా -కొత్తగా 3,464 కేసులు, 35 మరణాలు -ఉభయ గోదావరిలో భారీగా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొద్దిగా తగ్గింది. టెస్టులు తగ్గకున్నా కొత్తగా వెలుగుచూస్తోన్న పాజిటివ్ కేసులు తగ్గుముఖంపట్టాయి. అయితే మరణాలు మాత్రం ఇప్పటికీ భారీగానే ఉంటుండటం గమనార్హం. డిశ్చార్జీలు భారీగా పెరగడంతో యాక్టివ్ కేసులు తగ్గాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకాస్త వేగం పుంజుకుంది. వివరాలివి..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం వెలువరించిన లెక్కల ప్రకారం.. గడచిన 24 గంటల్లో 93,759 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 3,464 మందికి కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20 లక్షలకు చేరువగా,18,96,818గా నిలిచాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 667 కొత్త కేసులు, పశ్చిమ గోదావరిలో 397 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 597 కేసులు, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 78 కేసులు వచ్చాయి.

నిన్న ఒక్కరోజే కొవిడ్ కారణంగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. తద్వారా మొత్తం మరణాల సంఖ్య 12,779కి పెరిగింది. కొత్తగా చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, కృష్ణా, శ్రీకాకుళంలో ముగ్గురేసి, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కడప, కర్నూల్, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.
గడిచిన 24 గంటల్లో 4,284 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 18,46,716కు పెరిగింది. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 37,323గా ఉంది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఇప్పటికే 1.5కోట్ల డోసుల పంపిణీ జరగ్గా, జిల్లాలవారీగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ల స్పీడ్ పెంచారు.












Click it and Unblock the Notifications