ఏపీలో కరోనా: పెరిగిన మరణాలు -నిన్న 41మంది మృతి, కొత్తగా 3620 కేసులు -మొత్తం 1.5కోట్ల మందికి టీకాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రెండో దశ విలయం ఇంకా కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాలు మళ్లీ భారీగా పెరిగాయి. రికవరీలు కూడా ఎక్కువగానే ఉండటంతో యాక్టివ్ కేసులు తగ్గాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం వేగంగా కొనసాగుతోంది. టీకాలు పొందినవారికి సంఖ్య 1.5కోట్ల మార్కును దాటింది..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 91,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,620 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 617 కేసులు, పశ్చిమ గోదావరిలో 565 కేసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 451 కొత్త కేసులు వచ్చాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 44 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసులు 18,85,716కు పెరిగాయి.

నిన్న ఒక్కరోజే కొవిడ్ మహమ్మారికి 41 మంది బలైపోయారు. చిత్తూరు జిల్లాలో 7, కృష్ణా జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అలాగే కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. తద్వారా మొత్తం మరణాల సంఖ్య 12,671కి పెరిగింది.
గడిచిన 24 గంటల్లో 5,757 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 18,32,971కు పెరిగింది. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 40,074గా ఉంది. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జూన్ 28నాటికి మొత్తం 1.5మందికి వ్యాక్సిన్లు అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications