చంద్రబాబుకో న్యాయం, పేదలకో న్యాయమా?: కోర్టు స్టేపై నిలదీసిన సీపీఎం నేత
అమరావతి: ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైకోర్టులో స్టే తెచ్చుకున్న క్రమంలో అసలు స్టే అంటే ఏమిటో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు ప్రజలకు వివరించారు. ఆదివారం ఆయన న్యాయవాది సంపర శ్రీనివాత్‌తో కలిసి విజయవాడ భవానీపురం కరకట్ట ప్రాంతాన్ని సందర్శించారు.
అనంతరం బాధితులకు కోర్టు స్టే ఆర్డర్ గురించి వివరించారు. నదీ తీరాల సుందరీకరణ పేరుతో భవానీపురం కరకట్ట ప్రాంతంలోని పేద ప్రజల నివాసాలను ప్రభుత్వం తొలగించే ప్రక్రియ చేపట్టింది. అయితే తమకు తగిన నష్టపరిహారం ఇచ్చే వరకు ఇళ్లను తొలగించవద్దంటూ సుమారు 70 కుటుంబాలకుపైగా కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నాయి.

అయితే వారు కోర్టు నుంచి స్టే తెచ్చుకుని ఇళ్ల తొలగింపును అడ్డుకోవడం ప్రభుత్వానికి నచ్చలేదు. దీంతో సుమారు 70 రోజుల నుంచి కరకట్టవాసులకు తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిపివేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. దీంతో హైకోర్టు న్యాయవాది తిరుమలశెట్టి కిరణ్, నగరానికి చెందిన న్యాయవాది సంపర శ్రీనివాస్ బాధితుల తరఫున తిరిగి హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో బాధితులకు వారం రోజులలోపు తాగునీరు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఈ నెల ఒకటో తేదీన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్‌ఎస్ రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో బాధితులకు కోర్టు స్టే ఆర్డర్ గురించి సీపీఎం నేత సీహెచ్ బాబూరావు వివరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ 'ఓటుకు నోటు కేసులో కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న సీఎం చంద్రబాబు, అదే కోర్టు పేద ప్రజలకు ఇచ్చిన స్టేను ఎందుకు అమలు చేయరు? కరకట్టవాసులకు నిలిపివేసిన తాగునీరు, విద్యుత్ సరఫరాను వారం రోజులలోపు పునరుద్ధరించాలి. హైకోర్టు ఇచ్చిన స్టేను తక్షణమే అమలు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం' అని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications