అన్నా లెజినోవా తిరుమల మొక్కు కారణం అదేనట
Chandrababu and Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఘాటు విమర్శలు చేశారు.
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న పీ4 విధానాన్ని ఓ బూటకంగా అభివర్ణించారు రామకృష్ణ. పేదరికానికి గల కారణాలను అన్వేషించి, దాన్ని నిర్మూలించకుండా ఇలాంటి బూటకపు పథకాలు, విధానాలను అమలు చేయాలనుకోవడం మంచిది కాదని అన్నారు. ధనికులు- పేదలు అనే తారత్యమ్యాన్ని ప్రభుత్వమే సృష్టించినట్టుగా ఉందని చెప్పారు.

తమ ప్రభుత్వం పేదలకు ఏదీ చేయదని, అన్ని ధనిక వర్గాలకు మాత్రమే దోచిపెడతామని చంద్రబాబు- పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పినట్టయిందని రామకృష్ణ విమర్శించారు. ధనికులు, వాళ్ల దయాదాక్షిణ్యాల మీదే పేదలు ఆధారపడే పరిస్థితులను ప్రభుత్వమే కల్పించినట్టయిందని ధ్వజమెత్తారు.
ధనిక వర్గం- పేదరికానికి లింకు పెట్టడం విడ్డూరంగా ఉందని రామకృష్ణ వ్యాఖ్యానించారు. కొందరు ధనికులు తమ వద్ద ఉన్న డబ్బులు పేదలకు ఇస్తే- పేదరికం మటుమాయమౌతుందని చంద్రబాబు చెప్పడం జనం చెవిలో పూలు పెట్టడమేనని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అమలు చేస్తోన్న ఆర్థిక విధానాల కారణంగా పేద, ధనిక తారతమ్యం పెరుగుతోందని అన్నారు.
డబ్బున్న వాళ్లు డబ్బు లేని వాళ్లకు సహాయం చేయడాన్ని ఎవరూ తప్పు పట్టట్లేదని, ఈ విధానం ఎప్పటి నుంచో అమలులో ఉందని గుర్తు చేశారు. కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యత కింద ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోన్నాయని రామకృష్ణ పేర్కొన్నారు. అయినప్పటికీ- పేదరిక నిర్మూలన జరగలేదని వ్యాఖ్యానించారు.
కాషాయ దుస్తులు ధరించి, నుదుట బొట్టు పెట్టుకుని, సనాతనవాదిగా పవన్ కల్యాణ్ తయారయ్యాడని, రాష్ట్రంలో బీజేపీ అజెండాను మోస్తోన్నాడని రామకృష్ణ మండిపడ్డారు. ఓ క్రిస్టియన్ అయిన తన భార్యతోనూ పవన్ కల్యాణ్ చివరికి తిరుమలలో గుండు కొట్టించాడని, అంత అవసరమా అని విమర్శించారు. ఇదంతా కూడా బీజేపీ అజెండాను అమలు చేయడంలో భాగమేనని ఆరోపించారు.
వక్ఫ్ సవరణల చట్టం విషయంలో పవన్ కల్యాణ్‌ను ఎంతమాత్రం కూడా విశ్వసించలేమని రామకృష్ణ తేల్చి చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతు ఇవ్వడం పట్ల చంద్రబాబే తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వక్ఫ్ చట్టం వల్ల ముస్లిం సామాజిక వర్గానికి జరిగే అన్యాయాలపై చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications