పవన్ అలా చేస్తే - జగన్ నెత్తిన పాలు పోసినట్టే..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. 2014 పొత్తుల ఫార్ములా మరోసారి అమలు చేయాలని చంద్రబాబు - పవన్ భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ దిశగా బీజేపీ నుంచి సానుకూలత లేదు. ఇప్పుడు బీజేపీని ఒప్పించేందుకు పవన్ రంగం లోకి దిగారు. అదే జరిగితే ఏం జరుగుతుందో సీపీఐ నారాయణ జోస్యం చెప్పారు. ఆ మూడు పార్టీలు కలిస్తే జగన్ నెత్తిన పాలు పోసినట్టేనని ఆసక్తి కర సమీకరణాలు తీసుకొచ్చారు.
ఆ మూడు పార్టీలు కలిస్తే..: ఏపీలో పొత్తులపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ, వైసీపీలకు వ్యతిరేకంగా ఒక కూటమి కావాలన్నారు. దానిలో టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం ఉంటేనే వైసీపీపై విజయం సాధ్యమని నారాయణ అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ రాజకీయ లక్ష్యం లేకుండా వెళుతున్నారని వ్యాఖ్యానించారు. వాస్తవంగా బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తే జగన్ నెత్తిన పాలు పోసినట్టే అవుతుందని, అప్పుడు వైసీపీని ఓడించడం కష్టంగా మారుతుందని చెప్పారు. బీజేపీతో కలిస్తే ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం లేదన్నారు. ఆ పార్టీతో కలిసి జనసేన ఎన్నికలకు వెళతానంటే ఫలితం ఉండదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ వ్యతిరేకమని, విభజన చట్టాలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. పోలవరానికి నిధులు ఇవ్వలేదని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు.

పవన్ పులిపై సవారీ.. : ఇదే సమయంలో బీజేపీ తో పవన్ స్నేహం పైన నారాయణ విశ్లేషణ చేసారు. పవన్ పులిపై సవారీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబునూ ఆ పులిపై సవారీకి ఆహ్వానిస్తున్నారని విశ్లేషించారు. అయితే చంద్రబాబు ఆ పులిపై ఎక్కుతాడో లేదో తెలియడం లేదన్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ- వామపక్షాలు పరస్పర అవగాహనతో సహకారం అందించుకున్నాయి. రెండో ప్రాధాన్యత ఓట్టను టీడీపీకి వేసేలా ఒప్పందం చేసుకున్నాయి. టీడీపీకి ఆ ఒప్పందం కలిసి వచ్చింది. ఉత్తరాంధ్రతో పాటుగా సీమలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీడీపీ రెండో ప్రాధాన్యత ఓటుతో గెలుచుకుంది. దీంతో, అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ-జనసేన- వామపక్షాలు కలిసి కూటమిగా పోటీ చేయాలనేది నారాయణ అభిప్రాయం.

2014 ఫార్ములా దిశగా..:
పవన్ కళ్యాణ్ తాజా ఢిల్లీ పర్యటనలో కీలక ప్రతిపాదన చేసారు. బీజేపీ నేతల ముందు తన ఆలోచన బయట పెట్టారు. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే తిరిగి ఏపీలో 2014 తరహాలో మూడు పార్టీలు ఏకం కావాల్సిన అవసరాన్ని వివరించారు. కానీ, బీజేపీ నేతల నుంచి ఈ ప్రతిపాదన పైన స్పష్టత రాలేదు. కర్ణాటక ఎన్నికల తరువాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. టీడీపీతో కూటమిలో కలిసేందుకు ఇప్పటి వరకు బీజేపీ సుముఖంగా లేదు. పవన్ ప్రయత్నాలు ఫలిస్తే తిరిగి 2014 ఎన్నికల తరహాలోనే పొత్తులు ఉండే అవకావం ఉంది. బీజేపీ అంగీకరించకుంటే టీడీపీ -జనసేన కలిసి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications