
షాకింగ్: 2021 క్రైమ్ రిపోర్ట్ ..ఏపీలో మహిళలపై 21.5శాతం పెరిగిన నేరాలు; వారంలో 75 రేప్ కేసులు
2021 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై దాడులు, నేరాల పరిస్థితి ఎలా ఉంది? 2020 వ సంవత్సరం లో నమోదైన కేసులు కంటే 2021 సంవత్సరం లో మహిళలపై నేరాల కేసులు అధికంగా నమోదైన కారణాలేంటి? 2021 సంవత్సరం వార్షిక నేర నివేదికలో ముఖ్యంగా మహిళలపై జరిగిన నేరాలపై, నమోదు చేసిన కేసుల పై వెల్లడించిన ఆసక్తికర అంశాలు ఏంటి? అంటే

2021లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరిగాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021 వ సంవత్సరంలో మహిళలు ఎస్సీ ఎస్టీలపై నేరాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో భౌతిక దాడులు ఎక్కువగా కొనసాగాయి. దోపిడీలు, దొంగతనాలు, వైట్ కాలర్ నేరాలు కూడా గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో నమోదైన వరకట్న హత్యలు కాస్త తగ్గాయి. ఇదిలా ఉంటే 2021లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాలు గణనీయంగా పెరిగాయి అని 2021 సంవత్సరానికి చెందిన వార్షిక నేర గణాంక నివేదికలో వెల్లడైంది.

21.45 శాతానికి పైగా పెరిగిన మహిళలపై నేరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై చోటు చేసుకున్న నేరాల (CAW) కేసులు 21.45 శాతానికి పైగా పెరిగాయి. అయితే విచారణకు తీసుకున్న సగటు రోజులు 2020లో 102 నుండి 2021లో 42 రోజులకు గణనీయంగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం గా 2020లో 1,22,987 నేరాలు నమోదు కాగా 2021లో 1,27 ,127 నేరాలు నమోదయినట్లు గా వార్షిక నేర నివేదికలో వెల్లడించారు. మొత్తం నేరాల రేటు మూడు శాతం పెరిగిందని రాష్ట్ర పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

మహిళలపై పెరిగిన నేరాల సంఖ్య వారిలో పెరిగిన అవగాహనను సూచిస్తుందన్న డీజీపీ
రాష్ట్రంలో మొత్తం నేరాల్లో 14 శాతం ఉన్న మహిళలపై నేరాల కేసులు 2021లో 17,736గా నమోదయ్యాయి. మహిళలపై నేరాల శాతం 21.45 కు పెరిగింది. ఈ సంఖ్య 2020లో 14,603గా నమోదైనట్టు సమాచారం. ఏపి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ మహిళలపై నేరాల సంఖ్య పెరగడాన్ని ప్రతికూల కోణంలో చూడవద్దని, ఈ సంఖ్య పోలీసు, క్రిమినల్ న్యాయ వ్యవస్థలో కేసుల సంఖ్యను సూచిస్తుందని మరియు ప్రభుత్వం మహిళల్లో కల్పిస్తున్న అవగాహనను సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతం కంటే ఇప్పుడు నేరాలు పెరగడం వెనక మహిళలలో పెరిగిన అవగాహన కారణమని తెలిపారు

పోలీసులు కల్పించిన అవగాహనతో ఫిర్యాదు చెయ్యటంలో మహిళల ముందడుగు : డీజీపీ
ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు మహిళలు ముందుకు రావడానికి మరియు ఫిర్యాదు చేయడానికి మేము అనేక కార్యక్రమాలను నిర్వహించామని ఫలితంగా కేసుల సంఖ్య పెరిగిందన్నారు. మహిళల భద్రత కోసం రూపొందించిన దిశ యాప్ 97 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉందని, ఇది మహిళల్లో పెరిగిన అవగాహన స్థాయిని సూచిస్తుంది అని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

మహిళలపై నేరాల్లో ఏడు రోజుల్లో 75 రేప్ కేసులు, మొత్తం 1,061 లైంగిక నేరాల కేసులు
ఏడు రోజుల్లో 75 రేప్ కేసులతో పాటు మొత్తం 1,061 లైంగిక నేరాల కేసులు నమోదయ్యాయని వార్షిక నివేదిక ద్వారా తెలుస్తోంది. మహిళలపై జరిగిన అన్ని నేరాలు మొత్తంగా ఈ ఏడాది 21 శాతం మేర ఎక్కువయ్యాయి వేధింపులకు సంబంధించిన నేరాలు 49.0 నాలుగు శాతం మేర గా మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన ఘటనలు 22.4 శాతం పెరిగాయి. మొత్తంగా చూస్తే ఈ ఏడాది 21.4 5 శాతం మహిళలపై నేరాల కేసులు నమోదయ్యాయి.