ఏపీపై తుఫాన్ పడగ- ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Cyclone Dana: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ పంజా విసిరింది. కనివినీ ఎరుగని రీతిలో విరుచుకుపడింది. ఈ తెల్లవారు జామున 5:30 గంటల సమయంలో ఒడిశాలోని ధమారా- హబాలిఖటి మధ్యన తీరాన్ని తాకింది. ఈ ప్రక్రియ దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది.
అర్ధరాత్రి దాటిన తరువాత 12:20 నిమిషాలకు తుఫాన్ తీరాన్ని తాకే ప్రక్రియ ఆరంభమైంది. తెల్లవారు జామున 5:30 గంటల సమయంలో సైక్లోన్ ఐ తీరం దాటింది. తుఫాన్ తీరాన్ని దాటిన సమయంలో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. రెండు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసినట్లు సమాచారం అందింది.

ఫలితంగా కొన్ని చోట్ల సముద్రం ముందుకు పొడుచుకొచ్చింది. దాదాపు 15 మీటర్ల వరకు ముందుకొచ్చింది. తీరం ప్రాంతం మొత్తం అల్లకల్లోలానికి గురైంది. తుఫాన్ ధాటికి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అనేక జిల్లాలు దీని బారిన పడ్డాయి.
రాత్రి నుంచి ఏకధాటిగా వర్షాలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కంటి మీద కునుకు లేకుండా గడిపారక్కడి జనం. 120 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు భారీ వృక్షాలు సైతం కూకటివేళ్లతో సహా నేలకూలాయి. కమ్యూనికేషన్ల వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఆయా జిల్లాల్లో ఫోన్లు మూగబోయాయి.

విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. తుఫాన్ తీరం దాటిన కొద్దిసేపటికే సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు రంగంలోకి దిగాయి. రోడ్లపై కూలిన చెట్లను తొలగిస్తోన్నాయి.
కాగా తుఫాన్ ప్రభావం ఏపీపైనా కనిపించింది. ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది.
ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు ఉండొచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. శని, ఆది, సోమవారాల్లో ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా తీర ప్రాంత జిల్లాలు, ఏజెన్సీ ఏరియాల్లో చెప్పుకోదగ్గ వర్షం కురిసే అవకాశాలు లేకపోలేదు. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చని పేర్కొంది.












Click it and Unblock the Notifications