Cyclone Gulab: వైఎస్ జగన్ అత్యవసర సమీక్ష: గ్రామ సచివాలయాల్లో కంట్రోల్ రూమ్స్
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. తుఫాన్‌లా మారింది. ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు తూర్పు-ఆగ్నేయ దిశగా 470 కిలోమీటర్లు, ఏపీలోని కళింగ పట్నానికి 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది. ఈ తుఫాన్ తీవ్రత అంచనాలకు మించిన స్థాయిలో ఉండొచ్చంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలను జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. నష్ట నివారణ చర్యలను చేపట్టాయి. వీలైనంతగా నష్టాన్ని నివారించడానికి తక్షణ చర్యలను తీసుకున్నాయి. ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు ఈ రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. ఆదివారం సాయంత్రం నాటికి ఈ గులాబ్ తుఫాన్ తీరాన్ని దాటుతుందని వెల్లడించారు.

దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కోస్తా ఉత్తర ప్రాంతంలోని తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. గులాబ్ తుఫాను ప్రభావం వల్ల నెల్లూరు జిల్లాలో సైతం ఉరుములు, పిడుగులతో వర్షాలు పడొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ప్రకాశం జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొనవచ్చని అంటున్నారు.
అలాగే కడప, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాత్రికి దాని తీవ్రత మరింత పెరగొచ్చని తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. ఆ తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై కనిపించింది. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. చాలా చోట్ల చిరుజల్లులు పడ్డాయి.
గులాబ్ తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సాయంత్రం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాతావరణ కేంద్రం అధికారుల నుంచి తుఫాన్ సమాచారాన్ని తెప్పించుకున్నారు. తుఫాన్ సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించ వద్దని ఆదేశించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
ఆయా జిల్లాల్లోని అన్ని గ్రామ సచివాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను నెలకొల్పామని, 24 గంటలు ఇవి అందుబాటులో ఉంటాయని అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో సహాయక, పునరావాస శిబిరాలను యుద్ధ ప్రాతిపదికన నెలకొల్పాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించనున్నట్లు చెప్పారు. మత్స్యకారులెవరూ సముద్రంలో వెళ్లొద్దంటూ తీర ప్రాంత జిల్లాల్లో ఆదేశాలను జారీ చేశారు.












Click it and Unblock the Notifications