బంగాళాఖాతంలో ఆవర్తనం... సంక్రాంతికి ఏపీలో వర్షాలు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రెండురోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఈనెల 9వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం 10వ తేదీన నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.2 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించివుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి సాధారణ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాలో మాత్రం 12వ తేదీ వరకు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో మాత్రం పొడి వాతావరణం
దక్షిణ కోస్తాలో మాత్రం 10, 12 తేదీల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు, 12వ తేదీ నుంచి సాధారణ వర్షాలు కురుస్తాయి. వర్షాలపై ఎలాంటి హెచ్చరికను మాత్రం అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేయలేదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరో నాలుగురోజులు ఉంటుందని, దీని ప్రభావంతో నాలుగురోజులపాటు ఏపీలో తేలికపాటి వర్షాల నుంచి సాధారణ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే తెలంగాణలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణకు ఎటువంటి వర్షసూచన లేదు. తెలంగాణలో 15వ తేదీ వరకు పొగమంచు బాగా విస్తరించనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఆందోళన చెందుతున్న రైతులు
ఏపీలో తేలికపాటి వర్షాలు, సాధారణ వర్షాల ప్రభావంవల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలావరకు పంటకోతలను పూర్తిచేశారు. అరకొరగా పొలాల్లో మిగిలిపోయివున్నవాటి కోతలు పూర్తిచేయకపోతే వర్షంవల్ల నష్టపోతామని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇటీవలే ఏపీ ప్రభుత్వం ధాన్యం తడిసినప్పటికీ, 25 శాతం వరకు తేమ ఉన్నప్పటికీ సాధారణ ధరనే చెల్లించి కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. అలాగే ధాన్యం నిల్వ కేంద్రాలను అధికారులు తనిఖీలు చేయాలని, ఎక్కడికక్కడ బియ్యం వివరాలను లెక్కించి, పూర్తిస్థాయి నివేదికను రూపొందించి పౌరసరఫరాలశాఖ కార్యాలయానికి పంపించాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications