Cyclone Montha: మొంథా తుపాన్ ట్విస్ట్ ..! కాకినాడ వద్ద తీరం దాటట్లేదా ?
ఏపీలో మొంథా తుపాను కలకలం కొనసాగుతోంది. తూర్పు తీరం దిశగా తుపాను దూసుకొస్తోంది. దీంతో కోస్తా జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అయితే ఇవాళ అతి తీవ్ర తుపానుగా మారినప్పటికీ వర్షాలు మాత్రం ఆ స్ధాయిలో లేవు.దీంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. ఉదయం నుంచి ఈదురుగాలులు మాత్రం వీస్తున్నాయి. సముద్రంలో అలలు ఎగసి పడుతున్నాయి. మరోవైపు కాకినాడ వద్ద రేపు తీరం దాటుతుందని భావించినా అది కాస్తా దిశ మార్చుకుంటోంది.
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఉదయం 11.30కు విడుదల చేసిన బులిటెన్ ప్రకారం పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మొంథా బలపడింది. గత 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదిలిన తుపాన్, ప్రస్తుతానికి మచిలీపట్నంకి 160 కిమీ, కాకినాడకి 240 కిమీ, విశాఖపట్నంకి 320 కిమీ దూరంలో కేంద్రీకృతం అయింది. ఈరోజు రాత్రికి కాకినాడ- మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.

మొంథా తుపాను తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు,కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. కాబట్టి ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కోరుతున్నారు. ఇప్పటికే పలు పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.

ప్రస్తుతం మొంథా తుపాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇదే పరిస్ధితి కొనసాగితే వచ్చే ఐదు గంటల్లో మచిలీపట్నానికి 100 కిలోమీటర్లకు చేరువ కానుంది. అందుకే కాకినాడ-మచిలీపట్నం మధ్య ఈ తుపాను తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. తొలుత కాకినాడ వద్ద ఇది తీరం దాటుతుందని అంచనా వేసినా ఇప్పుడు మచిలీపట్నానికి దగ్గరగా వస్తుండటంతో అధికారులు ఆ మేరకు ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications