మొంథా తుఫాన్ బీభత్సం- కాకినాడ తీరానికి చేరువ అవుతున్న కొద్దీ: ఏపీలో ఈ జిల్లాల్లో వరద ముప్పు
బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాన్ మొంథా.. మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ భీతావహంగా మారుతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్.. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. తీరాన్ని దాటుతున్న సమయంలో అంచనాలకు అందని విధంగా బీభత్సాన్ని సృష్టించే అవకాశాలు లేకపోలేదు. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకూ అతి భారీ వర్షాలకు కారణమౌతోంది.
ప్రస్తుతం ఈ మొంథా తుఫాన్ బంగాళాఖాతం నైరుతి, పశ్చిమ-మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమైందీ మొంథా తుఫాన్. చెన్నైకి తూర్పు-ఆగ్నేయ దిశగా 640, విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయం దిశలో 740, కాకినాడకు ఆగ్నేయ దిశలో 710, ఒడిశాలోని గోపాల్‌పూర్ కు దక్షిణ-ఆగ్నేయ దిశలో 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. మంగళవారం ఉదయానికి పెను తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

క్రమంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అదే రోజు రాత్రికి మచిలీపట్నం- కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో తీరం వెంబడి గంటకు 90 నుండి 110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, దీని తీవ్రత 110 కిలోమీటర్ల వరకు పెరగవచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే- పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరిల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
సన్నద్ధతలో భాగంగా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్- 7, ఎస్డీఆర్ఎఫ్-9 బృందాలను పంపించినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులతో తీర ప్రాంతాలన్నీ కూడా అల్లకల్లోలానికి గురయ్యే అవకాశం ఉందని, ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. నేడు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ-అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి రాకూడదని వర్షం కురిసేటప్పుడు, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, హోర్డింగులు, శిథిలావస్థలో ఉన్న భవనాలు, గోడల వద్ద నిల్చోకూడదని సూచించారు.












Click it and Unblock the Notifications