లోకల్స్‌కు టీటీడీ శుభవార్త- అలా కలిసొచ్చింది
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 62,971 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,439 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 2.99 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 21 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

కాగా- తిరుమలలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది టీటీడీ. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఈ నెల 11వ తేదీ మెట్లోత్సవం ఆరంభమౌతుంది. 13వ తేదీ వరకు కొనసాగుతుంది. తిరుమలలోని ఆస్థాన మండపం దీనికి వేదిక. దీనికి ఏర్పాట్లు చేపట్టారు టీటీడీ అధికారులు.
అదే రోజున స్థానికులకు శ్రీవారి దర్శనం లభించనుంది. దీని కోసం నేడు టోకెన్లను జారీ చేస్తోన్నారు టీటీడీ అధికారులు. తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో స్థానికులకు స్వామివారి దర్శనం టోకెన్ల జారీ కార్యక్రమాన్ని చేపట్టారు.
స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించాలంటూ టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల తొలి మంగళవారం నాడు అది సాధ్యపడలేదు. 4వ తేదీన రథ సప్తమిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ స్థానికుల దర్శనాన్ని నెలలో మొదటి మంగళవారం నుంచి రెండో మంగళవారానికి మార్చిన విషయం తెలిసిందే.
దీనికి అనుగుణంగా నేడు టోకెన్ల జారీ చేపట్టారు అధికారులు. టోకెన్లు లభించిన స్థానికులు 11వ తేదీన తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది. అదే రోజున శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఆరంభం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానికులకు కలిసివచ్చినట్టయింది. ఈ మెట్లోత్సవం మూడు రోజుల పాటు కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications