కాంగ్రెస్ బాటలోనే: టిఆర్ఎస్‌పై దత్తాత్రేయ మండిపాటు
హైదరాబాద్: మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ బాటలో పయనిస్తోందని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపి బండారు దత్తాత్రేయ అన్నారు. కానీ, కాంగ్రెస్‌కు కోర్టుల్లో ఎలాంటి పరిస్థితి ఎదురైందో టిఆర్‌ఎస్ గమనించాలని అన్నారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ టిఆర్‌ఎస్ హామీ ఇచ్చిందని, ఇది ఓటు బ్యాంకు రాజకీయాలకు పనికొస్తుందే తప్ప వారి అభివృద్ధికి పనికి రాదని దుయ్యబట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ ఇలాంటి రిజర్వేషన్లు తెస్తే... మతపర రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ కోర్టులు కొట్టేశాయని గుర్తు చేశారు.

టిఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అదే బాటలో పయనిస్త్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దత్తాత్రేయ పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ పిల్లలకు మాత్రమే ఫీజు రీఎంబర్స్‌మెంట్ చేస్తామంటున్న ప్రభుత్వం, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పిందని గుర్తు చేశారు.
అయితే తెలంగాణలో ఉన్న పేద విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుందా లేదా? ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం కేజీ టు పీజీ విద్యలో భాగం కాదా అని ప్రశ్నించారు. స్థానికత అంశం, ముల్కీ నిబంధన ఒక్కటే కాదా? ముల్కీ ఆధారంగానే 371 (డి)కు తుది రూపమిచ్చిన విషయం వాస్తవం కాదా అని దత్తాత్రేయ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications