అప్పుడు జగన్-ఇప్పుడు చంద్రబాబు-సేమ్ అవే ఆరోపణలు- బుచ్చయ్య ఎపిసోడ్ తో మరోసారి
ఏపీలో రాజకీయాలు ఎప్పుడే మలుపు తిరుగుతాయో ఎవరికీ అర్ధం కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షాల్లోకి వచ్చినప్పుడు మరోలా వ్యవహరించే రాజకీయ పార్టీల నేతలు.. తిరిగి స్ధానాలు మారితే తిరిగి తమ ధోరణుల్ని సైతం మార్చుకునేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం తాజాగా టీడీపీలో చెలరేగిన బుచ్చయ్య చౌదరి రాజీనామా కల్లోలమే. లోలోపల వ్యవహారాలు ఏమున్నా.. బయటికి చెప్పే కారణం మాత్రం ఒక్కటే. అదే ఇప్పుడు చంద్రబాబును దోషిగా నిలబెడుతుంటే గతంలో జగన్ నూ ఇబ్బందిపెట్టింది.

ఏపీ రాజకీయాలు
బహుముఖ రాజకీయాలకు చోటు తక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. ఇక్కడ గతంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య దశాబ్దాల పాటు పోరు సాగగా.. ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు సాగుతోంది. ఇందులోనూ చంద్రబాబు మాత్రం సుదీర్గకాలం కాంగ్రెస్, వైసీపీలకు ప్రత్యర్ధిగా ఉన్నారు. అయితే ప్రత్యర్ధుల సంగతి ఎలా ఉన్నా సొంత పార్టీలపై మాత్రం ఇప్పుడు చంద్రబాబు, జగన్.. గతంలో రాజశేఖర్ రెడ్డి వంటి వారు పూర్తి పట్టు సాధించారు. ఇందుకు గల కారణం వారు అనుసరించే ధోరణులే. సహజంగా దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో కనిపించే అధిపత్య ధోరణులే అయినా ఇందులోనూ వీరి రూటే వేరని చెప్పవచ్చు.

సొంత పార్టీల్లో నియంతృత్వం
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినా ఇప్పుడు జగన్, చంద్రబాబు అయినా తమ సొంత పార్టీల్లో నేతల్ని అధుపులో ఉంచేందుకే తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తుంటారు. దీన్నే వారి రాజకీయ ప్రత్యర్ధులు నియంతృత్వంగా అభివర్ణిస్తుంటారు. ఈ ఆరోపణల్ని కూడా సరైన టైమ్ చూసి తెరపైకి తెస్తుంటారు. విచిత్రంగా ప్రత్యర్ధులతో పాటు సొంత పార్టీ నేతలు కూడా తమకు అవసరమైన సందర్భాల్లో ఈ నియంతృత్వ అస్త్రాన్ని తెరపైకి తెస్తుంటారు. తాజాగా ఇలా తెరపైకి వచ్చిందే టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్. టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ ని అని చెప్పుకునే బుచ్చయ్య చౌదరి తాజాగా పార్టీ అధిష్టానంపై చేసిన విమర్శలతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

బుచ్చయ్య ఎపిసోడ్ లోనూ ఇదే
టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చయ్య చౌదరి తాజాగా పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ కూడా తన ఫోన్లు తీయడం లేదని, తనను పట్టించుకోవడం లేదని, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. తనను కలిసిన వారితోనూ ఇదే మాటల్ని ఆయన చెప్తున్నారు. దీంతో చంద్రబాబు, లోకేష్ నియంతృత్వ ధోరణి వ్యవహారం తెరపైకి వస్తోంది. సహజంగా ప్రాంతీయ పార్టీల్లో కనిపించే ధోరణి మినహాయిస్తే నిజంగానే చంద్రబాబు, లోకేష్ అంతపెద్ద నియంతలా అన్న చర్చ కూడా పార్టీలో, బయట కూడా సాగుతోంది. దీంతో బుచ్చయ్య చౌదరి చేసిన ఆరోపణలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి.

జగన్ పైనా ఇవే ఆరోపణలు
గతంలో వైసీపీ నుంచి గెలిచి లేదా వైసీపీలో వనిచేసి ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీలో చేరిన నేతలంతా పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్ పై సరిగ్గా ఇలాంటి ఆరోపణలే చేసేవారు. అప్పట్లో జగన్ అహంకారి అని, నియంత అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే పార్టీ ఫిరాయిస్తూ జగన్ పై ఆరోపణలు చేసిన చరిత్ర ఉంది. దీంతో నియంతృత్వపు ఆరోపణలు జగన్ కూ తప్పలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ ఆరోపణలు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. దీంతో విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం పార్టీ అధినేతలు నియంతల్లా కనిపిస్తారా అన్న చర్చ సాగుతోంది.

జగన్, చంద్రబాబు నియంతలైతే ?
ఏపీలో రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అధినేతల్ని కాకా పట్టి ఎంచక్కా అధికారాన్ని అనుభవిస్తున్న నేతలు.. అధికారం కోల్పోయాక మాత్రం వారినే నియంతలుగా చూస్తూ విమర్శలు చేస్తున్నారు. తాము కోరుకున్న పదవులు దక్కనప్పుడు, ఫిరాయింపులకు సిద్ధమైనప్పుడు, తమ అనుచరులకు అవకాశాలు ఇప్పించుకోలేనప్పుడు ఇలాంటి నియంతృత్వ విమర్శలు తెరపైకి వస్తున్నాయి. దీంతో ఆయా పార్టీల అధినేతలు అధికారంలో ఉన్నప్పుడు హీరోలుగానూ, విపక్షాల్లోకి రాగానే విలన్లుగా మారిపోతున్నారు. వాస్తవానికి జగన్ అయినా చంద్రబాబు అయినా నియంతృత్వత్వంతో వ్యవహరించాలని భావిస్తే ఇలాంటి నేతలకు పార్టీల్లో కనీస మర్యాద అయినా దక్కుతుందా అన్నది అనుమానమే. అలాగే విపక్షాల్లో ఉన్నప్పుడు ఇలాంటి నేతలు చేసే విమర్శల్ని అధికారంలోకి వచ్చాక వారు గుర్తుపెట్టుకున్నా వీరి భవిష్యత్తు అగమ్య గోచరమే. అటువంటప్పుడు తాత్కాలిక ప్రయోజనాల కోసం నేతలు చేసే నియంతృత్వ విమర్శల్ని జనం ఎలా తీసుకుంటున్నారో ఎన్నికల ఫలితాలే చెప్తున్నాయి.












Click it and Unblock the Notifications