శ్రీశైలం వెళుతున్నారా? అయితే ఒక ముఖ్య గమనిక
శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జునస్వామివారి దేవస్థానంలో డిసెంబర్ 31, జనవరి 1న ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. దీంతో దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. భక్తులకు త్వరగా దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సామూహిక అభిషేకాలు, బ్రేక్ టికెట్ పొందినవారికి మాత్రమే స్వామివారి అలంకార దర్శనం ఉంటుంది. ఆర్జిత హోమాలు, అమ్మవారి కుంకుమార్చనలు యథావిధిగా ఉండనున్నాయి. ఆర్జిత హోమాలు, కుంకుమార్చన టికెట్లు ఆన్‌లైన్‌లోనే దొరుకుతాయి. జనవరి 3 నుంచి ఆలయంలో ప్రాతఃకాలసేవను కొత్తగా ప్రవేశపెట్టబోతున్నారు.

ఉదయం వేళలో రూ.25,116 రుసుంతో దీన్ని అమలు చేయనున్నారు. రోజులో ఒక ఉదయాస్తమానసేవ, ఐదు ప్రాతఃకాలసేవ.. రెండింటినీ కలిపి మొత్తం ఆరు టికెట్లను జారీచేస్తారు. ప్రాత:కాల సేవలో పాల్గొనేవారికి స్వామివారి మహా మంగళహారతి, ప్రత్యేక పంచామృత అభిషేకం (స్వామివారి గర్భాలయంలో), అమ్మవారికి కుంకుమార్చన, వేదాశీర్వచనం, స్వామివారి శేషవస్త్రం, కాటన్ పంచె, చీర, జాకెట్ పీస్, ఒక రోజు వసతి కల్పిస్తారు. పది సంవత్సరాల్లోపు పిల్లలకు ఉచితంగా స్వామివారి స్పర్శదర్శనం ఉంటుంది.
శ్రీశైలంలో రూ.75 కోట్ల వ్యయంతో నూతన క్యూ కాంప్లెక్స్, రూ.52 కోట్లతో 200 గదుల యాత్రికుల వసతి సముదాయాలను నిర్మించబోతున్నారు. రూ.7కోట్లతో ఒక మెగా వాట్ సోలార్ పవర్ ప్లాంట్, రూ.5.85 కోట్లతో దేవస్థానం ఉద్యోగుల క్వార్టర్స్ కు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, సబ్‌స్టేషన్ పనులకు శ్రీకారం చుట్టారు.












Click it and Unblock the Notifications