దిక్కుతోచని స్థితి: కాంగ్రెస్, బిజెపిలపై హరీశ్, గల్లంతేనని
మెదక్: మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బిజెపి ఎంపి అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతేనని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌పై విశ్వాసం లేకపోవడంవల్లే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒక్క రొక్కరుగా జారుకుంటున్నారని అన్నారు. సోమవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతాప్రభాకర్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది కాంగ్రెస్, బిజెపి, టిడిపిలకు చెందిన కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. టిఆర్‌ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి వలసలు పెరగడంతో కాంగ్రెస్, బిజెపిలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయన్నారు.
కాంగ్రెస్ నుంచే కాకుండా టిడిపి నుంచి కూడా తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్ నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ కోసం కొండా సురేఖ, మహేందర్‌రెడ్డి, గోవర్ధన్‌లు టిఆర్‌ఎస్‌లో చేరారని పేర్కొన్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రులకు వత్తాసు పలికిన జగ్గారెడ్డి బిజెపిలో చేరారని దుయ్యబట్టారు. మెదక్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి గెలవడం ఖాయమని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పడం మేకపోతు గాంభీర్యానికి నిదర్శనమన్నారు.

గతంలో పరకాల ఉప ఎన్నికల్లో కూడా బిజెపి గెలుస్తుందని కిషన్‌రెడ్డి, జాతీయ నాయకులు ప్రచారం చేసిన ప్పటికీ ఆ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతయిందని గుర్తు చేశారు. జగ్గారెడ్డికి కూడా డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని చెప్పారు. గత ఎన్నికల్లో బిజెపికి అనేక గ్రామాల్లో పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకలేదనీ, ఇప్పుడు కాంగ్రెస్‌కు కూడా అదే దుస్థితి నెలకొందన్నారు.
కార్యకర్తలు లేక కాంగ్రెస్ సభలు వెలవెల బోతున్నాయని వ్యాఖ్యనించారు. గతంలో మంత్రిగా పని చేసిన సునీతారెడ్డి ఏనాడైనా తెలంగాణ అమర వీరుల కుటుంబాలను పరామర్శించారా? అని ప్రశ్నించారు. సీమాంధ్రులకు ఏజెంట్‌గా మారిన జగ్గారెడ్డి వారి ప్రోత్సాహంతోనే నేడు మెదక్ లోక్‌సభ బరిలో దిగారని ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మెదక్ జిల్లా పటాన్‌చెరులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపి సిఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుల సిఫారసుతో పోటీ చేస్తున్న జగ్గారెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, భానూప్రసాద్, జగదీశ్వర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెంమహిపాల్‌రెడ్డి, బాబూమోహన్, శ్రీనివాస్‌గౌడ్, గ్యాదరికిషోర్, టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్ధి కొత్తప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications