మొండిచేయి: ఏడ్చేసిన బాబూ మోహన్, చెరుకు
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పార్టీల అధినేతలు టికెట్లు ఇవ్వకుండా మొండిచేయి చూపిస్తుండడంతో కొంత మంది నేతలు బహిరంగంగానే ఏడ్చేస్తున్నారు. బిజెపి నాయకత్వం బర్మేర్ టికెట్ నిరాకరించడంతో సీనియర్ నేత జస్వంత్ సింగ్ కంటతడి పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అది మరింత విస్తృతమైనట్లు కనిపిస్తోంది.
మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభా నియోజకవర్గంలో బాబూ మోహన్ గెలుస్తాడా, లేదా అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓ ఎలక్ట్రానిక్ సర్వే నిర్వహించారు. దీంతో తీవ్రంగా మనస్తాపానికి గురైన బాబూ మోహన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసే సమయంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన బాబూ మోహన్ - పార్టీకి, ప్రజలకు సేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులను అమ్ముకున్నానని కంటతడి పెట్టుకున్నారు.

ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పోలిట్‌బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ వంతు వచ్చింది. నల్లగొండ జిల్లా నక్రేకల్ శానససభ నియోజకవర్గం టికెట్ ఇవ్వడానికి పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నిరాకకరించడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసే సమయంలో చెరుకు సుధాకర్ బోరున ఏడ్చేశాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన చెరుకు సుధాకర్ నాసా కింద అరెస్టయి 35 రోజులు జైలు జీవితం కూడా గడిపారు.
గత వారం వైయస్సార్ కాంగ్రెసు అరకు టికెట్ ఆశించిన కుంభా రవి కూడా బహిరంగంగా అందరి ముందే ఏడ్చేశాడు. పార్టీ తనను పట్టించుకోకపోవడంపై ఉద్వేగానికి లోనైన ఆయన కంటతడి పెట్టారు. ఆయన కంట నీరు పెడుతుంటే ఆయన అనుచురులు కూడా ఏడ్పేశారు. తనను మోసం చేశారని, జగన్ టికెట్ ఇస్తానని హామి ఇచ్చారని, ఇప్పుడు నిరాకరిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications