దక్షిణా కోస్తాలో భారీ వర్షాలు: తిరుమలలో విరిగిపడుతున్న కొండచరియలు
విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తాపై ప్రభావం చూపుతోంది. దీని ప్రభావంతో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా తిరుమలలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి పలు చోట్ల బండరాళ్లు పడుతూనే ఉన్నాయి.
దాంతో ఘాట్‌రోడ్లు మూసివేసే ఆలచనలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు ఉన్నారు. తిరుమలలోని రెండో ఘాట్‌రోడ్డు ప్రమాదకరంగా ఉంది. 16వ కిలోమీటర్ దగ్గర రోడ్డుపై పెద్ద బండరాళ్లు పడ్డాయి. ఎప్పటికప్పుడు బండరాళ్లను తొలగిస్తున్నా భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించింది.

13వ కిలోమీటర్ నుంచి 18వ కిలోమీటర్ వరకు దాదాపు 15 చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాలు కొనసాగిన పక్షంలో ఈరోజు రాత్రి 13వ కిలోమీటర్ వద్ద ఉన్న లింక్‌రోడ్డు వరకు రెండో ఘాట్‌రోడ్డును మూసివేయాలనే ఆలోచనలో టిటిడి అధికారులు ఉన్నారు. తిరుమలకు వస్తున్న భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో 13వ కిలోమీటర్ నుంచి ట్రాఫిక్‌ను మళ్లించి లింక్ రోడ్డు ద్వారా మొదటి ఘాట్‌లోని వాహనాలను మళ్లించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, ఆదివారం రాత్రి నుంచి ప్రకాశం జిల్లాలో కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం కొనచెరువుకు గండి పడింది. ఈ స్థితిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణా రావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
నెల్లూరు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని 11 మండలాల్లోని అధికారులు అప్రమత్తయ్యారు. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నెంబర్ 0861-2331477 ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications