తీరం దాటిన వాయుగుండం - నాలుగు జిల్లాల్లో దంచికొడుతున్న వర్షాలు : అల్లకల్లోలం..!!
భారీ వర్షాలు..వదరలతో పలు ప్రాంతాల్లో జల ప్రళయం ముంచుకొస్తోంది. ఇప్పటికే చిత్తూరు...నెల్లూరు జిల్లాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. తిరుపతి పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది. తిరుమలలోనూ భారీగా వరద నీరు రావటంతో ఘాట్ రోడ్లు మూసివేసారు. మాడ వీధుల్లో వరద నీరు ప్రవహిస్తోంది. ఇక, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఉదయం 3-4 గంటల మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ ప్రభావంతో తమిళనాడు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఇక తీరం వెంబడి 45 నుంచి 65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ తెలియజేసింది. సహాయ చర్యలకు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని సహాయ చర్యలు చేపడుతున్నాయి.

24 గంటల పాటు భారీ వర్షాలు
మరో 24 గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు వరదల కారణంగా నిలిచిపోయారు. వారి కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వర్షాల కారణంగా శ్రీవారి దర్శనానికి తిరుమలకు రాలేకపోతున్న భక్తులకు ఊరట కలిగించే విషయాన్ని తెలిపింది. భారీ వర్షాలతో శ్రీవారి దర్శనానికి రాలేకపోయిన భక్తులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.

సీమ జిల్లాల్లో దంచి కొడుతున్న వానలు
నేడు, రేపు దర్శన టికెట్లు ఉంటే వర్షాలు తగ్గాక భక్తులకు స్వామి వారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. వర్షం వల్ల తిరుమల వెళ్లలేని భక్తులకు తిరుపతిలో వసతి కల్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లో భక్తులకు బస ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లాలో రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రమైన అనంతపురంలో రాత్రి నుంచి వర్షం కురుస్తున్నది. అనంతపురంతో పాటుగా కదిరి, పుట్టపర్తిలో కూడా భారీగా వర్షం కురుస్తున్నది. జిల్లాలోని చిత్రావతి, బుక్కపట్నం చెరువుకు భారీగా వరదనీరు చేరుతున్నది.

నెల్లూరు లో దంచి కొడుతున్న వర్షం
చెరుపులు పూర్తిస్తాయిలో నిండిపోవడంతో అటువైపు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిత్రావతికి భారీగా వరదనీరు చేరడంతో పుట్టపర్తి బ్రిడ్జిపైన ప్రవహిస్తోంది. నెల్లూరు జిల్లాల్లోనూ సమద్రతీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ భారీ వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో పరిస్థితిని ఆరా తీసారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.