సైన్యానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం
భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ ను ఎక్కుపెట్టింది భారత్ సైన్యం. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది టెర్రరిస్టులు హతం అయినట్లు కేంద్ర రక్షణశాఖ పేర్కొంది. దాడులకు ప్రతిస్పందనగా పాకిస్థాన్ కాశ్మీర్ ప్రాంతంలో దాదాపు 400 డ్రోన్లతో దాడికి పాల్పడింది. అయితే భారత్ ఆ దాడులను తిప్పి కొట్టింది.
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని కేంద్ర రక్షణశాఖ పేర్కొనడంతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సరిహద్దులో పాకిస్థాన్ తో పోరాడుతున్న సైన్యానికి మద్దతుగా షష్ట షణ్ముక క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని జన సైనికులకు పిలుపునిచ్చారు.
షష్ట షణ్ముక క్షేత్రాలతో పాటు కర్ణాటక, ఏపీలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని.. చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని జనసేన పార్టీ శ్రేణులకు పవన్ సూచించారు. సైన్యం కోసం దేశం మొత్తం ప్రార్థనలు చేయాల్సిన సమయం ఇదేనని అన్నారు. ఈమేరకు ఆదివారం అరసవెల్లి ఆలయంలో పూజలు చేయనున్నారు.
షష్ట షణ్ముఖ క్షేత్రాలైన తిరుత్తణి, తిరుచెందూరు, పళని, తిరుపరం కుండ్రమ్, స్వామిమలై, పలముదిరచోళై క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. అంతేకాక ప్రతి ఆలయానికి ఒక ఎమ్మెల్యే, జన సైనికులను పంపించి ప్రత్యేక పూజలు చేయించనున్నారు.

ఇక కర్ణాటకలోని కుక్కే, ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్‌లోని మోపిదేవి, బిక్కవోలులోని సుబ్రహ్మణ్య ఆలయంతో పాటుగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయం,పిఠాపురం శ్రీ పురూహూతిక దేవి ఆలయాల్లో పూజలు చేయించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు జనసేన పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
అంతకుముందు ఆపరేషన్ సింధూర్ పై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు భారత ఆర్మీ గట్టి సమాధానం చెప్పిందని తెలిపారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అని పేర్కొన్నారు. అంతేకాక సామాజిక మాధ్యమాల్లో దేశానికి వ్యతిరేకంగా ఎవరూ పోస్టులు పెట్టొద్దని సూచించారు. గీత దాటితే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.
సైనికులకు, దేశ నాయకత్వానికీ దైవ బలం తోడవ్వాలని షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో జనసేన పూజలు pic.twitter.com/l9QYLo6iAC
— JanaSena Party (@JanaSenaParty) May 9, 2025
మరోవైపు భారత్- పాకిస్థాన్ దాడుల్లో వీరమరణం పొందిన సైనికుడు మురళి నాయక్ కు పవన్ నివాళులు అర్పించారు. మీ కృషి, త్యాగం దేశం మరువబోదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మురళి నాయక్ సేవలను కొనియాడారు.












Click it and Unblock the Notifications