జగన్ పర్యటన వేళ.. విజయవాడలో దేవినేని ఇంటికి పోలీసులు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై గత జగన్ ప్రభుత్వానికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ మరో పర్యటనకు శ్రీకారం చుట్టారు. గుంటూరు తర్వాత ఇక ఇబ్రహీంపట్నానికి వెళ్లనున్నారు.
నేడు ఇబ్రహీంపట్నంలో.. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు జగన్. ఈ పర్యటన వివరాలను ఆయన పీఏ కే నాగేశ్వర రెడ్డి వెల్లడించారు. ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుండి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. వారధి, బస్టాండ్, కనకదుర్గ ఫ్లైఓవర్, భవానీపురం, గొల్లపూడి, గుంటూరుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో గల జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు.

మధ్యాహ్నం 12 గంటల వరకు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. వారికి ధైర్యం చెబుతారు. ఇటీవలే తెలుగుదేశం- జనసేన నాయకులు, కార్యకర్తలు విసిరిన పెట్రోల్ బాంబ్ దాడిలో ఆయన ఇళ్లు ధ్వంసమైంది. పలు వస్తువులు కాలిపోయిన విషయం తెలిసిందే. అనంతరం మధ్యాహ్నం 12:00 గంటలకు ఇబ్రహీంపట్నం నుండి జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. తుమ్మలపాలెం, గుంటూరుపల్లి, గొల్లపూడి, భవానీపురం, కనకదుర్గ ఫ్లైఓవర్, బస్టాండ్, వరధి మీదుగా 12:30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఇందులో మార్పులు సూచించారు పోలీసులు. విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి నల్లకుంట, గుంటుపల్లి, తుమ్మలపాలెంల మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని రూట్ మ్యాప్ ఇచ్చారు. ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. ఈ పర్యటన నేపథ్యంలో జనసమీకరణ చేయకూడదంటూ పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు.
దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి వారికి నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనలో పాల్గొనవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. జగన్ పర్యటనపై ఆంక్షలు విధించినట్లు వివరించారు. ఈ పర్యటనలో భారీగా ప్రజలు గుమిగూడే అవకాశం ఉందని పేర్కొన్నారు. బయటి వ్యక్తులు కూడా ఇందులో పాల్గొనకూడదని అన్నారు. దీన్ని వైసీపీ నాయకులు వ్యతిరేకిస్తోన్నారు. నోలీసులు ఇచ్చినప్పటికీ వెళ్లి తీరుతామని స్పష్టం చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications