జగన్‌కు ఏజెంట్‌లా: రఘువీరాపై ఉమ, జైలు ఖాయం: గాలి
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్రంగా ధ్వజమెత్తారు, రఘువీరారెడ్డి భాష సరిగ్గా లేదని, రఘువీరా రెడ్డి తన భాషను మార్చుకోవాలని మంత్రి అన్నారు. తుళ్ళూరు అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు జగన్‌కు ఏజెంట్లలా తయారయ్యారని, లేకపోతే రైతులను ఎందుకు రెచ్చగొడతారని ఆయన ప్రశ్నించారు.
రాజధాని కోసం భూములిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తుంటే నేతలు ఎందుకు బాధపడుతున్నారని, రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు చొరవతో అందరి దృష్టీ ఆంధ్రప్రదేశ్‌పైనే ఉందని ఆయన అన్నారు. ఇంకా తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు విడివిడిగా ఎందుకు, కలిసిపోవాలని ఆయన సూచించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్మోహరెడ్డి 30 ఏళ్లు అధికారంలో ఉంటారో లేదో తెలియదు గానీ, 30 ఏళ్లు జైల్లో ఉండటం ఖాయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. సోమవారం ఆయన మీడియా సమవేశంలో జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
రూ. 69 కోట్ల అవినీతికి పాల్పడితేనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నాలుగేళ్ల జైలు శిక్ష పడిందని, రూ. 41 వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్‌కు ఎన్నేళ్లు శిక్ష విధించాలని అన్నారు. జగన్ చేసిన అవినీతికి మూడు జన్మలపాటు జెల్లోనే ఉండాలని గాలి వ్యాఖ్యానించారు. అధికారం అండతో దారుణమైన దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. విచ్చలవిడిగా కబ్జాలు, ప్రభుత్వ సొమ్మును తిన్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications