గట్టు మీద ముచ్చట్లేంటి?, పొలంలో దిగండి: అధికారులపై మంత్రి ఉమ ఫైర్
విజయవాడ: ప్రభుత్వ అధికారులు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆగ్రహం తెప్పించారు. సోమవారం నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వ్యవసాయ, అనుబంధ శాఖ అధికారులు, సిబ్బంది పొలాల్లో దిగకుండా రోడ్డుపైనే నిల్చుని ముచ్చట్లు సాగించడంపైమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.
విజయవాడ నగర పరిధిలోని గొల్లపూడి వద్ద ఏరువాక పౌర్ణమిలో పాల్గొనేందుకు మంత్రి ఉమ, జిల్లా కలెక్టర్ బాబు, తదితరులు వచ్చారు. తలకు పాగా చుట్టి, పంచె కట్టి నాగలి పట్టి సంప్రదాయంగా ఎడ్డన అదిలిస్తూ మంత్రి ఏరువాక ప్రారంభించారు.

కాగా, అదే సమయంలో వ్యవసాయ సిబ్బంది అంతా సమావేశం కోసం అన్నట్లుగా రోడ్డుపై ఉండిపోవడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు, సిబ్బంది పొలంలోకి దిగి నాగలి పట్టారు. పొలంలోకి దిగితే తప్ప రైతుల కష్టం ఏమితో తెలియదని అధికారులను మంత్రి మందలించారు.
అవినీతి సహించం: మంత్రి కామినేని
ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీలకు ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో ఖాళీల భర్తీకి సంబంధించి పూర్తి పారదర్శకంగా ముందుకు వెళతామని మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే జరుగుతుందని తెలిపారు.
కాగితాల రూపంలో వచ్చే దరఖాస్తులు, వినతులు, అభ్యర్థనలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. బదిలీల్లో సహకరిస్తామంటూ ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
రెండేళ్లు పూర్తయిన వారందరికీ బదిలీలకు అవకాశం ఉంటుందని మంత్రి కామినేని చెప్పారు. భార్యాభర్తలు ఉద్యోగులైతే వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందని మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications