'ఖబడ్దార్ దేవినేని'కి ఉమ కౌంటర్: 'అసమర్ధుడివి, సాగర్‌ని కాదు నీ నోటిని శుద్ధి చేసుకో'
విజయవాడ: తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందని ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ ప్రాజెక్టులకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని అంటూ తెలంగాణ రాసిన 11వ షెడ్యూల్‌లో నిన్న, ఈరోజు ప్రారంభం చేసిన ప్రాజెక్టుల గురించి చెప్పారా? అని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
"టీడీపీ మీద ఎందుకు దాడి చేయాలి, కేసీఆర్! సోయిలో ఉండి మాట్లాడుతున్నావా? లేక సోయ లేకుండా మాట్లాడుతన్నావా?" అని అడిగారు. కెసిఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అంటూ హుస్సేన్ సాగర్‌ను కాదు శుద్ధి చేయాల్సింది, ముందు కెసిఆర్ తన నోటిని శుద్ధి చేసుకోవాలని మంత్రి దేవినేని హితవు పలికారు.

తెలుగుదేశం పార్టీపై దాడి చేయాలనే భావనతో కేసీఆర్ మాట్లాడుతున్నారని, కేసీఆర్ భాష మార్చుకోవాలని అన్నారు. కేసీఆర్ ఒక సీఎంగా ఉండి ఆడా... మగా అని మాట్టాడడం సిగ్గుచేటని, ముఖ్యమంత్రిగా ప్రజలకు నేర్పే సంస్కారం ఇదేనా? అంటూ మంత్రి దేవినేని ప్రశ్నాంచారు. కేసీఆర్ భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉందని అయన అన్నారు.
నకిలీ పాస్‌పోర్టులు, దొంగనోట్ల గురించా నేను మాట్లాడానా? అని ఆయన ప్రశ్నించారు. నల్గొండ, ఖమ్మం, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో సాగర్ ఆయకట్టు కింద బతుకుతున్న రైతుల గురించి తాను మాట్లాడానని దేవినేని వెల్లడించారు. కృష్ణా డెల్టాకు చుక్కు నీరు కూడా నష్టం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
కృష్ణా జలాలను తీసుకెళ్తే తాము వద్దనమని, కానీ అనుమతులు తీసుకోమని మాత్రమే తాను చెప్పానని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాజెక్టులకు మాత్రమే శంకుస్ధాపన చేస్తున్నారని, ఏడాది గడిచినా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయని అసమర్ధుడు కేసీఆర్ అని తెలిపారు.
సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్‌లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ సీఎం చంద్రబాబు ప్రోద్భలంతో తమపై అవాకులు చెవాకులు పేలుతున్నాడని అన్నారు.
"పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవు, ఎక్కడ నిర్మిస్తావు కేసీఆర్? అని ఆ సన్నాసి ప్రశ్నిస్తున్నాడు. నీ అబ్బ జాగీరా కృష్ణా నది? అంటూ ప్రశ్నించారు. సమైక్యరాష్ట్రంలో నీ ఇష్టం వచ్చినట్టు దొడ్డిదారిన కట్టినటువంటి ప్రాజెక్టులకు, నీ హంద్రీనీవా ప్రాజెక్టుకు అనుమతి ఉందా?" అని అడిగారు.
"నీ పోతిరెడ్డిపాడుకు అనుమతి ఉందా? నీ కండలేరుకు అనుమతి ఉందా? నీ సోమశిల రిజర్వాయర్‌కు అనుమతి ఉందా? ఎవరబ్బ జాగీరు అని కట్టావు? పట్టిసీమ ప్రాజెక్టు నిన్నగాక మొన్న మొదలుపెట్టారు మీరు... పోలవరం నుంచి కృష్ణానదికి నీటిని మళ్లించడానికి" కెసిఆర్ అన్నారు
"ఎవర్నిడిగి మొదలుపెట్టావు? అలాంటప్పుడు నన్నడిగే అధికారం నీకెక్కడిది అని అడిగారు. ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ నీలాంటి కుక్కల మాటలు విని పాలమూరు ప్రాజెక్టు వద్దంటాడా? కేంద్రం అడ్డుకుంటుందా? ఆ సాహసం చేస్తుందా? హరిహరబ్రహ్మాదులు అడ్డంవచ్చినా, నీ తాతజేజమ్మలు అడ్డంవచ్చినా, కోటిమంది చంద్రబాబు నాయుళ్లు కొంగజపాలు చేసినా మీ కళ్ల ముందే ప్రాజెక్టు కట్టిచూపిస్తాం. ఇదే నా పాలమూరు శపథం. ఇది తెలంగాణ గడ్డ, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు" అంటూ హెచ్చరించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications