జగన్ పార్టీలోకి దేవినేని నెహ్రూ?: అది జరగదని వంగవీటి రాధా ధీమా
విజయవాడ: కాంగ్రెసు పార్టీ విజయవాడ నేత దేవినేని నెహ్రూ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే, వంగవీటి రాధాను ఒప్పించడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, దేవినేని నెహ్రూను పార్టీలోకి తీసుకు రావడానికి మాత్రం వైయస్ జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
నెహ్రూను పార్టీలోకి తీసుకు వచ్చే విషయంపై జగన్ తన కృష్ణా జిల్లా పార్టీ నాయకులతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ముద్రగడ పద్మనాభం ఆందోళన నేపథ్యంలో కాపులపై కేసులను పెట్టగూడదన నెహ్రూ చేసిన డిమాండ్‌ను జగన్ పార్టీలో చేరడానికి లింక్ పెడుతు్నారు.
కమ్మ సామాజికవర్గాన్ని తన వైపు తిప్పుకోవడానికి చాలా కాలంగా జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే దేవినేని నెహ్రూను పార్టీలోకి తీసుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల ఈ విషయంపై ఓ విలేకరి ప్రశ్నించినప్పుడు కావాలంటే ఈ క్షణమే తీసుకుంటాం, నీకేమైనా అభ్యంతరమా అని ఎదురు ప్రశ్న వేశారు.

కాంగ్రెసు పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేకపోవడం, తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులే తనకు ప్రత్యర్థులు కావడం వంటి పరిస్థితుల నేపథ్యంలో దేవినేని నెహ్రూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు.
నెహ్రూ జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించి, ఆయన కుమారుడు అవినాష్‌కు జిల్లాలో ఎక్కడైనా ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని జగన్ ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా ఇటీవల నెహ్రూతో సమావేశమై చర్చలు జరిపినట్లు చెబుతున్నారు.
వంగవీటి రాధాను ఒప్పించడమే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముందు ఉన్న అంశంగా చెబుతున్నారు. నెహ్రూకు ఆయన బద్ధవిరోధి. నెహ్రూ వైసిపిలో చేరే విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు అలాంటిదేం జరగదని, ఆ నమ్మకం తనకు ఉందని వంగవీటి రాధా అన్నారు. రాజకీయాలు ఏ మలుపైనా తిరగవచ్చు.












Click it and Unblock the Notifications