తిరుమలలో శ్రీవారి భక్తులు ఫుల్ హ్యాపీ, మరో వైపు దంచికొట్టిన వాన, తిరుపతిలో ఓకే
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారి భక్తులు పులకించిపోయారు. బుధవారం ఉదయం నుంచి నల్లటి మేఘాలు దర్శనం ఇవ్వడంతో చల్లటి వాతావరణంతో శ్రీవారి భక్తులు మంచి అనుభూతికి లోనయ్యారు. అయితే తిరుమలలో ఒక్కసారిగా వాన దేవుడు తన ప్రతాపం చూపించడంతో తిరుమలలో పలు ప్రాంతాల్లో ఉన్న భక్తులు తడిచిపోకుండా షెల్టర్ కోసం పరుగులు తీశారు.
తిరుమలలో మంగళవారం రాత్రి సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం నల్లటి మేఘాలు తిరుమల కొండలను కప్పేశాయి. మద్యాహ్నం మొదలైన వాన సుమారు గంటపాటు కురిసింది. ఆతరువాత సాయంత్రం వరకు చిరుజల్లులు కురిసాయి. గత రాత్రి భారీ వాన కురవడంతో శ్రీవారి ఆలయ ప్రాంతం, మాడవీధులు, కాటేజీలు, రోడ్లు తడిచి ముద్ద అయ్యాయి.

ఎత్తుప్రదేశాల నుంచి వర్షం నీరు తిరుమల రహదారుల మీదకు ప్రవహించింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు కొన్ని గంటలపాటు ఇబ్బందిపడ్డారు. తిరుమలకు వెళ్లి వచ్చే ఘాట్లలో వాహనదారులూ ఇబ్బంది పడ్డారు. రాత్రిపూట కొన్ని గంటల పాటు వాహనాలు తిరుమల ఘాట్ రోడ్లలో సంచరించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. తిరుమలలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీవారి ఆలయంలో దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వామివారి ప్రసాదాలు తీసుకొచ్చే భక్తులు ప్రసాదాలు తడిచిపోతాయని ఆందోళనకు గురైనారు.
ఇక తిరుపతిలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. పగలంతా అధిక ఉష్ణోగ్రతలతో తల్లడిల్లిపోయిన తిరుపతి నగర ప్రజలు, తిరుమలకు వచ్చి వెళ్లే భక్తులు సాయంత్రం ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయ్యింది. గంట తరువాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. తిరుపతి రోడ్లు చెరువులను తలపించాయి. కాలువల్లోని మురుగు నీరు రోడ్ల మీదకు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.












Click it and Unblock the Notifications