శైవక్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తులు: శివనామస్మరణతో మారుమోగుతున్న ఆలయాలు
అమరావతి: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు శైవక్షేత్రాలకు పోటెత్తుతున్నారు. తెల్లవారు జాము నుంచే ఆలయాల వద్ద బారులు తీరి నిల్చున్నారు. మహా శివుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తోన్నారు. శివలింగాలను అభిషేకిస్తోన్నారు. శివ నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ప్రఖ్యాత శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తజన సంద్రంగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శివాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
కర్నూలు జిల్లా శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి ప్రత్యేక వాహనాల్లో మల్లికార్జునుడి దర్శనం కోసం తరలి వస్తోన్నారు. మహా జాగారణ, లింగోద్భవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లికార్జునుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్ఠానం, రుద్రపారాయణం, రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. మంగళవారం రథోత్సవాన్ని నిర్వహించనున్నారు.చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు. కాళహస్తీశ్వరుడు జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తోన్నారు.

కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన భక్తులతో శ్రీకాళహస్తి పోటెత్తింది. పంచభూత శివలింగాల్లో శ్రీకాళహస్తీశ్వరాలయం ఒకటి. ఇక్కడ వెలిసిన వాయులింగేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో చేరుకుంటోన్నారు. చిత్తూరు సమీపంలోని కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దర్శనానికీ భక్తులు బారులు తీరి నిల్చున్నారు. కర్నూలు జిల్లాలోని మహానంది ఆలయంలో మహా శివరాత్రి పండగ ఘనంగా జరుగుతోంది. నంద్యాల పరిసరాల్లోని నవనంది ఆలయాలను భక్తులు దర్శించుకుంటోన్నారు.
పంచారామ క్షేత్రాల్లో మహా శివరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. అమరారామం, ద్రాక్షారామం, క్షీరారామం, కుమారరామం, సోమారామంలలను భక్తులు దర్శించుకుంటోన్నారు. గుంటూరు జిల్లాలోని కోటప్పకొండపై వెలిసిన త్రికోటేశ్వర స్వామివారిని వందలాదిమంది భక్తులు దర్శించుకుంటోన్నారు. తెలంగాణలోని ప్రఖ్యాత శైవక్షేత్రం వేములవాడలో మహా శివరాత్రి పండగను భక్తులు వైభవంగా జరుపుకొంటోన్నారు. రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. గద్వాల జిల్లా అలంపూర్‌లో వెలిసిన ప్రాచీన నవబ్రహ్మ జోగుళాంబ ఆలయాన్ని దర్శించడానికి భకులు పెద్ద సంఖ్యలో చేరుకుంటోన్నారు.












Click it and Unblock the Notifications