బెజవాడ దుర్గమ్మ దర్శనానికి కొండలెక్కేస్తున్న భక్తులు-ప్రమాదకరంగా ట్రెక్కింగ్..!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్నాయి. ఇవాళ్టితో శరన్నవరాత్రులు ముగుస్తున్న నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి భారీ రద్దీ ఏర్పడింది. ఎక్కడెక్కడి నుంచో తరలివస్తున్న భక్తులతో పాటు భవానీలు కూడా భారీ సంఖ్యలో చేరుకుంటుండటంతో పోలీసులు వారిని నియంత్రించలేక చేతులెత్తేశారు. దీంతో భక్తులు తమకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో కొండపైకి చేరుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై భారీ రద్దీ నేపథ్యంలో కొండపైకి ఘాట్ రోడ్డు ద్వారా, మెట్ల మార్గంలో చేరుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. దీంతో భక్తులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇంద్రకీలాద్రిపైకి చేరుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరిలో కొందరు ప్రమాదకరంగా కొండలు ఎక్కేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎలాగైనా కొండెక్కేస్తే దర్శనం దక్కుతుందన్న ఆశతో వారు ఇలాంటి ఫీట్లు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులతో పాటు భక్తుల్లోనూ టెన్షన్ పెరుగుతోంది.

వర్షాకాలంలో కొండపై నుంచి బండరాళ్లు కిందపడే ప్రమాదం ఉండటంతో ఎక్కడికక్కడ ఫెన్సింగ్ లు వేశారు. అయినా భక్తులు వాటిని కూడా లెక్కచేయకుండా కొండపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో పురుషులతో పాటు మహిళలు కూడా ఉండడం మరో విశేషం.

పిల్లల్ని కూడా కొండపైకి ఎక్కించేందుకు వీరు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినా పోలీసులు వీరిని నియంత్రించడం లేదు. దీంతో అధికారుల ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసామని చెబుతున్నా క్షేత్రస్ధాయిలో అదంతా ఒట్టిదేనని తేలిపోతోంది.












Click it and Unblock the Notifications