శ్రీవారి టోకెన్ల కోసం గంటలకొద్దీ భక్తులు పడిగాపులు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి నెలకొంది. బుధవారం నాడు 77,332 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,5460 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.38 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 21 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 నుంచి 18 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు టీటీడీ సిబ్బంది. ఇదే రద్దీ ఇంకొంతకాలం పాటు కొనసాగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది.

కాగా- శ్రీవారి దివ్య దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. వందలాదిమందితో కౌంటర్లు క్రిక్కిరిసి పోయాయి. ముందు రోజు సాయంత్రం నుంచి కౌంటర్ల వద్దే పడిగాపులు పడ్డారు. వారి ఎదురుచూపులు కొన్ని గంటల పాటు సాగాయి. అయినప్పటికీ- టీటీడీ సిబ్బంది పట్టించుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనానికి టోకెన్లు జారీ చేస్తారు. ఇక్కడ టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలో తప్పనిసరిగా వాటిని స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే స్లాటెడ్ దర్శనానికి అనుమతి ఉండదు.
భూదేవి కాంప్లెక్స్‌లో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైం స్లాట్ దర్శనం పొందలేరు. ఈ టికెట్ల కోసం భక్తులు పడిగాపులు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications