TTD: శ్రీవారి పెద్ద శేష వాహన సేవ, సీఎం చేతుల మీదుగా ఆవిష్కరణ
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన శుక్రవారం రాత్రి పెద్ద శేష వాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 14 కళాబృందాలలో 410 మంది కళాకారులు ప్రదర్శనలిచ్చారు.
ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒడిస్సీ నృత్యం, తమిళనాడుకు చెందిన లతారవి ఆధ్వర్యంలో మయూర నృత్యం, కేరళ రాష్ట్రానికి చెందిన వీణ బృందం యక్షగానం, కర్నాటక కళా రూపమైన వీరగాశను చేతన్ బృందం అద్భుతంగా ప్రదర్శించారు.

శ్రీకాకుళం నుండి శ్రీమతి దుర్గా భవానీ, తిరుమల నుండి శ్రీనివాసులు, రాజమండ్రి నుండి శ్రీసురేష్ బాబు, తిరుపతి బాలమందిర్ విద్యార్థులు కోలాటాలతో మంత్ర ముగ్ధులను చేశారు.
హైదరాబాదుకు చెందిన శ్రీమతి లక్ష్మీదేవి బృందం ఒగ్గుడోలుతోను, తిరుపతికి చెందిన డాక్టర్ మురళీకృష్ణ బృందం మోహినీయట్టంతోను, కర్ణాటకకు చెందిన శ్రీమతి వనీష బృందం పటకునిత కళా విన్యాసం, శ్రీ రవికుమార్ చిలిపిలి గొంబె నృత్యం, శ్రీ నాగేంద్ర బృందం కంసాలి రూపకంతో తమ అద్భుతమైన ప్రదర్శనలతో భక్తులకు నయనానందాన్ని కలిగించారు.
డైరీలు, క్యాలెండర్లు ఆవిష్కరించిన సీఎం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన శుక్రవారం రాత్రి స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ ముద్రించిన 2025వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు.
12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, పెద్ద డైరీలు 8.25 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్ టాప్ క్యాలెండర్లు 1.25 లక్షలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు ఉన్నాయి.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు- శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 3 లక్షలు, 6 షిట్ క్యాలెండర్లు 50 వేలు, టీటీడీ స్థానిక ఆలయాలు 10 వేలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది.
రాష్ట్ర దేవదాయ శాఖ అమాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. 2025 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు అక్టోబరు 5వ తేదీ నుండి తిరుమల, తిరుపతిలో అందుబాటులో ఉంటాయి. అక్టోబరు రెండో వారం నుండి ఇతర ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయి..












Click it and Unblock the Notifications