ఫలితాలకు ముందే: వైసిపికే ప్రాధాన్యం..మా మాట వినటం లేదు: అధినేత వద్ద టిడిపి నేతల ఆక్రోశం..!
ఏపిలో ఎన్నికలు ట్విస్ట్‌లు మీద ట్విస్టులు ఇస్తున్నాయి. ఫలితాలు రాకముందే సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. ఇంకా అధికారంలో ఉన్నా..తమ మాటకు అధికారులు విలువ ఇవ్వటం లేదంటూ టిడిపి నేతలు వాపోతున్నారు. తమ మాట వినటం లేదనే బాధ కంటే..వైసిపి నేతల మాటలకు విలువ ఇవ్వటం వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో.. తమ పరిస్థితిని అధినేతకు మొర పెట్టుకుంటున్నారు..
ఫలితాలకు ముందే..
ఏపిలో పోలింగ్ మాత్రమే ముగిసింది. కౌంటింగ్ మిగిలి ఉంది. ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగుతుందా లేక ప్రభుత్వం మారుతుందా అనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో టిడిపి నేతలు తమ అవేదనను బయట పెడుతున్నారు. ఏపిలో ఎన్నికల ప్రచారం తరువాత....ప్రత్యేకించి పోలింగ్ సమయంలో అధికారులు తమ మాట వినటం లేదంటూ టిడిపి నేతలు అధినేతల వద్ద మొర పెట్టుకుంటున్నారు. తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు కడప..కర్నూలు జిల్లాల్లో పర్యటన సమయంలో అధికారుల తీరు పైన చర్చకు వచ్చింది.

ఆ సమయంలో టిడిపి నేతలు అధికారులతో తమకు ఎదురైన పరిస్థితులు వివరించారు. పోలింగ్ నాడు వైసిపి నేతల పైన పక్కా సమాచారంతో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటూ రాయలసీమ లోని ఓ జిల్లా నేతలు వాపోయారు. అదే విధంగా అధికార పార్టీ కార్యకర్తల మీద దాడుల సమయంలోనూ అధికారులకు ఫోన్ చేసినా స్పందించదలేదని ఫిర్యాదు చేసారు.
వైసిపి నేతల మాటకు ప్రాధాన్యత
అనేక ప్రాంతాల్లో వైసిపి నేతలు చెప్పిన మాటలకే అధికారులు ప్రాధాన్యత ఇచ్చారని టిడిపి రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయని సమాచారం. ఈనెల 23న ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్దులతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సందర్భంలోనూ తమకు ఎదురైన అనుభవాలను వివరించాలని అభ్యర్దులు భావిస్తున్నారు.

తమ మాట వినకపోయినా పర్వలేదు..వైసిపి నేతలు చెప్పగానే అమలు చేయటం పైన మాత్రం టిడిపి నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. అప్పుడే ఏపిలో అధికార మార్పిడి జరిగిన విధంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని వారు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే, ఎన్నికల సంఘం ఏపిలో అధికారుల పైన తీసుకున్న నిర్ణయాలు సైతం వారిని ప్రభావితం చేసాయని చెబుతున్నారు. ఎన్నికల ముందు రోజు సాయంత్రం టిడిపి నేతలను ఇబ్బంది పెట్టే విధంగా అధికారులు వ్యవహరించారని అధినేత దృష్టికి తీసుకొస్తున్నారు.












Click it and Unblock the Notifications